‘దళిత బంధు’ ప్లాన్ రివర్స్.. ఇతర సామాజిక వర్గాల నుంచి డిమాండ్స్..!

-

హుజురాబాద్ ఉప ఎన్నికలో నెగ్గేందుకు గాను సీఎం కేసీఆర్ ‘దళిత బంధు’ స్కీమ్ తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. కాగా, ఈ స్కీమ్ ద్వారా తెలంగాణ రాజకీయాల్లో దుమారమే చెలరేగుతోందని చెప్పొచ్చు. ఈటల రాజీనామా తర్వాత హుజురాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి అధికార పార్టీ‌యైన టీఆర్ఎస్ అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. ఈ క్రమంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు అందరూ రాజీనామా చేయాల్సిందేనని సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు జనాలు. కాగా, ఇతర సామాజిక వర్గాల నుంచి డిమాండ్స్ వస్తున్నాయి. తమ సామాజిక వర్గానికి ‘బంధు’ ఇవ్వాల్సిందేనని కోరుతున్నారు. తాజాగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య ‘బీసీ బంధు’ పేరిట స్కీమ్ ఏర్పాటు చేయాలని కోరుతూ బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌కు వినతి పత్రం సమర్పించారు. ఈ నేపథ్యంలో బీసీలను సంఘటిత పరిచి త్వరలో వీరు పోరుబాట పట్టొచ్చని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

cm-kcr
cm-kcr

దళిత కుటుంబానికి రూ.10 లక్షలు ఇచ్చినట్లుగానే సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్యా రంగాల్లో వెనుకబడిన బీసీల కోసం కూడా డబ్బులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అలా బీసీ బంధు అనే అంశం కూడా ప్రస్తుతం తెరమీదకు వచ్చింది. మొత్తానికి ‘దళిత బంధు’ ద్వారా రాజకీయ లబ్ధి చేకూరుతుందనుకున్న అధికార పార్టీకి షాక్ మీద షాక్ తగులుతున్నదని పలువురు అంటున్నారు. రాజకీయంగా ఎదుగుదల, ఓట్ల కోసమే ఈ పథకం ప్రవేశపెట్టారని, ప్రభుత్వం వద్ద అసలు డబ్బులే లేవని ఓ వైపు ప్రతిపక్ష పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. ఆర్థిక వేత్తలు సైతం ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేవని ధ్రువీకరిస్తున్నారు. ఇకపోతే కరోనా వంటి విపత్కర పరిస్థితుల వల్లనే ప్రభుత్వ ఆదాయం బాగా తగ్గిపోయిందని, ఇప్పుడు క్రమంగా పుంజుకుంటున్నదని తద్వారా సంక్షేమానికి ఎలాంటి లోటు ఉండదని అధికార పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news