తెలంగాణలో కాంగ్రెస్‌ని బలోపేతం చేయడమే లక్ష్యంగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) పనిచేస్తున్న విషయం తెలిసిందే. అధ్యక్షుడుగా బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి దూకుడుగా అధికార టీఆర్ఎస్‌పై విరుచుకుపడుతున్నారు. అలాగే ప్రజా సమస్యలపై పోరాటం కూడా చేస్తున్నారు. ఇటు ఇతర పార్టీ నేతలనీ కాంగ్రెస్‌లోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే పలువురు నేతలని రేవంత్ కలిసి పార్టీలోకి ఆహ్వానించారు.
అయితే ఇక్కడే రేవంత్ రెడ్డికి రివర్స్ షాక్ తగిలినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే ధర్మపురి సంజయ్, ఎర్రశేఖర్, గండ్ర సత్యనారాయణలు పార్టీలోకి రావడానికి సిద్ధమయ్యారు. పార్టీలోకి ఇతర పార్టీ నేతలు రావడంపై ఓ కమిటీ వేసి, వారిని తీసుకోవాలా వద్దా అనే ప్రక్రియ చేపట్టారు. మరి ఈ ప్రక్రియ వల్ల ఇతర పార్టీల నాయకులు ఏ మేర పార్టీలోకి వస్తారో చూడాలి.
ఇదిలా ఉంటే ఇటీవల కొండా విశ్వేశ్వర్ రెడ్డిని రేవంత్ కలిశారు. ఆయన కూడా కాంగ్రెస్‌లోకి వస్తారని అంతా అనుకున్నారు. కానీ ఆయన హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్ గెలుపు కోసం కృషి చేస్తున్నారు. బీజేపీ నాయకులతో కలిసి, ఈటలకు మద్ధతు ఇచ్చారు. అటు దేవేందర్ గౌడ్ ఫ్యామిలీని సైతం రేవంత్ కలిసి, పార్టీలోకి ఆహ్వానించారు. దేవేందర్ తనయుడు వీరేందర్ గౌడ్ కాంగ్రెస్‌లోకి వస్తారని ప్రచారం జరిగింది. కానీ ఆయన బీజేపీలోనే కొనసాగుతున్నాని చెప్పేశారు. తన తండ్రితో ఉన్న పరిచయాల కారణంగానే రేవంత్, తమ ఇంటికొచ్చారని చెప్పారు.
ఈ పరిస్తితిని బట్టి చూస్తే కొండా విశ్వేశ్వర్ రెడ్డి గానీ, వీరేందర్ గౌడ్ గానీ కాంగ్రెస్‌లోకి వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. కాకపోతే హుజూరాబాద్ ఉపఎన్నిక ఫలితం తర్వాత కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రేవంత్‌కు మద్ధతు ఇవ్వొచ్చని తెలుస్తోంది. ఎందుకంటే అక్కడ ఈటలకి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో కొండా ఉన్నారు. మరి చూడాలి రానున్న రోజుల్లో రాజకీయాలు ఎలా మారుతాయో?