ఆ ఇద్ద‌రి మృతిలోనూ బాబు కుట్ర‌.. కోడెల మృతిపై రోజా సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు…

నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి అసెంబ్లీ స్పీకర్ గా పనిచేసిన కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకుని హఠాన్మరణం చెందడంతో కేవ‌లం టీడీపీ నేత‌లే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయ‌న‌తో ఎంతో అనుబంధం ఉన్న నేత‌లు, ఇత‌ర పార్టీల‌కు చెందిన నేత‌లంద‌రిని షాక్‌కు గురి చేసింది. కోడెల మృతిపై విపక్ష టిడిపి విమర్శలు ఒక వెర్షన్ లో ఉంటే… అధికార వైసిపి నేతల వెర్ష‌న్‌ మరోలా ఉంది. ఈ రెండు పార్టీలు కోడెల మృతిని రాజకీయం చేసేశాయి. ప్రభుత్వం రాజ‌కీయంగా కక్ష సాధింపుల‌కు పాల్పడడంతోనే కారణమని… ఆయన ఆ మ‌నోవేదనతో ఆత్మహత్య చేసుకున్నారని టిడిపి నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.

ఇక టిడిపి నేతల మాటలను వైసీపీ నేతలు తిప్పి కొడుతున్నారు.తాజాగా రోజా కోడెల మృతికి చంద్రబాబు కారణం అని ఆరోపణలు చేస్తున్నారు. కోడెల ఇబ్బందుల్లో ఉంటే చంద్ర‌బాబు ప‌ట్టించుకోలేదు స‌రిక‌దా ? ఆయ‌న‌కు క‌నీసం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వ‌లేద‌ని టీడీపీ విమ‌ర్శ‌ల‌ను స్ట్రాంగ్‌గానే తిప్పికొడుతున్నారు. ఈ క్ర‌మంలోనే కోడెల మరణంపై స్పందించిన వైసీపీ ఎమ్మెల్యే రోజా చంద్రబాబుపై సంచలన ఆరోపణలు చేశారు.

నాడు మామ ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి… ఆయన మరణానికి కారకులైన చంద్రబాబు నాయుడే కోడెల మరణానికి కారణమని రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. కోడెల వల్ల కొంతమంది ఇబ్బందుల‌కు గుర‌య్యార‌ని… వారి ఆయ‌న‌పై కేసులు పెట్ట‌డంతో కోడెల చంద్ర‌బాబును క‌లిసేందుకు ప్ర‌య‌త్నించినా… ఆయ‌న మాత్రం కోడెల‌కు అపాయింట్‌మెంట్ ఇవ్వ‌కుండా.. త‌న‌ను క‌ల‌వ‌కుండా చేసి తీవ్రంగా అవ‌మానించారని రోజా ఆరోపించారు.

ఇటు సొంత మామ ఎన్టీఆర్‌, అటు వంగ‌వీటి రంగా లాంటి వ్య‌క్తుల మ‌ర‌ణం వెన‌క బాబు వేసిన కుట్ర‌లే ఉన్నాయ‌ని.. ఇప్పుడు కోడెల మృతి విషయంలో కూడా చంద్రబాబు హస్తం ఖచ్చితంగా ఉందని విమర్శించారు. కోడెలపై ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టలేదని, పేర్కొన్న రోజా బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకే కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఏదేమైనా కోడెల విష‌యంలో వైసీపీ వ‌ర్సెస్ టీడీపీ నేత‌ల మ‌ధ్య మాట‌ల యుద్ధంతో ఏపీ రాజ‌కీయ వాతావ‌ర‌ణం ఒక్క‌సారిగా వేడెక్కింది.