ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడు.. ఎక్కడ నెగ్గాలో తెలిసినవాడు.. రాజకీయ ధురంధరుడు.. తెలంగాణ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్.. గవర్నర్ నరసింహన్ తో చాలా స్నేహంగా ఉండేవారు. ఆయనకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చేవారు. ఎలాంటి ముఖ్య నిర్ణయం తీసుకున్నా ముందు గవర్నర్ కు చెప్పేవారు.
అలా ఐదేళ్లపాటు గవర్నర్ నరసింహన్ తో కేసీఆర్ సంబంధాలు చాలా సజావుగా.. స్నేహంగా.. ఆత్మీయంగా సాగాయి. కానీ తెలంగాణలో బలపడాలని భావిస్తున్న బీజేపీ ఇప్పుడు గవర్నర్ ను మార్చింది. సాధారణంగా గవర్నర్ అంటే.. కనీసం 70 ఏళ్ల పైబడినవారే ఉంటుంటారు. అదో రాజకీయ పునరావాస పదవి. పార్టీలో సీనియర్ మోస్టులను ఆ పదవులతో సత్కరిస్తుంటారు.
కానీ తెలంగాణ విషయంలో బీజేపీ సర్కారు మాత్రం ఇందుకు భిన్నంగా చేసింది. రాజకీయాల్లో ఇంకా యాక్టివ్ గా ఉన్న తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిని తెలంగాణకు గవర్నర్ గా చేసింది. దీంతో తెలంగాణ రాష్ట్ర సమితి శిబిరంలో అనుమానాలు మొదలయ్యాయి. సాధారణంగా గవర్నర్ పదవి అంత కీలకమైందేమీ కాదు. అధికారమంతా సీఎం చేతిలోనే ఉంటుంది. కానీ రాష్ట్రానికి అసలైన పాలకుడు మాత్రం గవర్నరే.. ఆయన పేరు మీదే పరిపాలన సాగుతుంది.
అలాంటి కీలకమైన గవర్నర్.. తాను తలచుకుంటే సీఎంకు చుక్కలు చూపించగలడు. కీలకబిల్లుల ఆమోదంలో.. ప్రభుత్వ ఏర్పాటు వంటి విషయాల్లో గవర్నర్ ది కీలకపాత్ర. అంతటి పాత్రలో ఓ కుర్ర నాయకురాలిని అమిత్ షా నియమించాడంటే అందుకు వెనుక బాగానే వ్యూహం పన్ని ఉండాలి. ఇప్పుడా వ్యూహం ఏంటో తెలిసిపోతోంది. తాను త్వరలో ప్రజా దర్బారును నిర్వహించనున్నట్టు గవర్నర్ తమిళిసై వేదికగా తెలపడం ఇప్పుడు కలకలం రేపుతోంది.
ప్రజా దర్బారు పేరుతో కేసీఆర్ పాలనలోని అసంతృప్తులను, బాధితులను రోజూ గవర్నర్ ప్రజాదర్బారు ద్వారా ఆహ్వానిస్తే.. అది కేసీఆర్ కు పక్కలో బల్లెం అవుతుంది. ఇప్పటికే తెలంగాణలో బలపడాలని భావిస్తున్న బీజేపీ గవర్నర్ ను రాజకీయ కార్యకలాపాలకు.. కక్ష సాధింపునకూ వాడుకునే అవకాశం చాలా ఉంది. తెలంగాణ సీఎం ప్రజలకే కాదు.. మంత్రులకూ అందుబాటులో ఉండరన్న అపవాదు ఉంది. ఇలాంటి సమయంలో గవర్నర్ తమిళిసై నిర్వహించే ప్రజాదర్బారు.. కచ్చితంగా టీఆర్ఎస్ ను ఇరుకున పెట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. చూడాలి ఏం జరుగుతుందో..?