వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన తర్వాత దూకుడుగా వెళ్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు త్వరత్వరగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే కీలక నిర్ణయాలు తీసుకుంటూ తనదైన శైలితో ముందుకు సాగుతున్నారు. పాలనలో దూకుడుగా వెళ్తున్న ఏపీ సీఎం జగన్ పలు సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటూ అన్ని వర్గాలను ఆకర్షిస్తున్నారు. ఎక్కడా అసంతృప్తి అనేది లేకుండా జాగ్రత్తపడుతున్నారు. ఇక తాజాగా మానసిక వికలాంగుల విషయంలో సీఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. గవర్నమెంట్ స్కూల్లో చదివే స్టూడెంట్స్ అందరికి వచ్చే విద్యా సంవత్సరం నుంచి జగనన్న విద్యా కానుక కిట్లు అందజేయాలని సీఎం జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
అలాగే మానసిక వికలాంగుల కోసం.. పులివెందుల విజేత స్కూల్ తరహాలో ప్రతి నియోజకవర్గంలో ఒక స్కూల్ ఉండేలా తక్షణమే ఏర్పాట్లు చేయాలన్నారు సీఎం. 6వ తరగతి నుంచే ఇంటర్నెట్ వినియోగంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఇక నేడు జగనన్న గోరుముద్ద, విద్యాకానుక, మనబడి నాడు నేడు పథకాలపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా కొత్త పాఠ్యపుస్తకాలు, వర్క్‌బుక్‌లను సీఎం పరిశీలించారు. 3 జతల యూనిఫాంకు సరిపోయే వస్త్రం, నోటు పుస్తకాలు, బ్యాగ్, బూట్లు, సాక్సులు, బెల్టుల పంపిణీపై పలు సూచనలు చేశారు. కాంపిటీటివ్ టెండర్లు పిలిస్తే ధరలు తగ్గే అవకాశం ఉందని..ఆ దిశగా ప్రణాళికలు సిద్దం చేయమని చెప్పారు. అదేవిధంగా, విద్యార్థుల ఫిర్యాదుల పరిష్కారం కోసం ప్రత్యేకంగా మొబైల్ యాప్ సిద్ధం చేయాలని జగన్ సూచించారు.