టీఆర్ఎస్‌కు షాక్.. పార్టీ మీటింగ్‌లో జై ఈటల నినాదాలు

తెలంగాణ సీఎం కేసీఆర్ ఈటల రాజేందర్ ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడంతో ఈటల సొంత నియోజవర్గమైన హుజురాబాద్ లో రాజకీయం వేడెక్కింది. అయితే హుజురాబాద్ లో తన క్యాడర్ నుంచి ఎవరు వెళ్ళిపోకుండా టీఆర్ఎస్ ఎప్పటికప్పడూ స్థానిక ప్రజాప్రతినిధులతో టచ్ లో ఉంటుంది. మంత్రి గంగుల కమలాకర్ హుజురాబాద్ నియోజకవర్గ పరిస్థితులపై కన్నేసి ఉంచారు.

 

ఇక తాజాగా శనివారం కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు కూడా టీఆర్ఎస్ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఈట‌ల వైపు ఎవ‌రూ వెళ్ల‌వ‌ద్ద‌ని లక్ష్మణ్ రావు కార్యకర్తలను కోరారు. పార్టీ మీకు అండ‌గా ఉంటుంద‌ని వారికి హామీ ఇచ్చారు. వ్యక్తులు ముఖ్యం కాదు పార్టీయే ముఖ్యమని అన్నారు. అయితే లక్ష్మణ్ రావు వ్యాఖ్యలపై ఈట‌ల వర్గానికి చెందిన కొందరు కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. జై ఈటల అంటూ నినాదాలతో సమావేశంలో గందరగోళం సృష్టించారు. మొన్నటి వరకు ఈటల వెంటే ఉండి, ఇప్పుడు ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడతారా…? అని నిలదీశారు.

దీంతో అటు ఈటల మద్దతుదారులకు ఇటు టీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం నెలకొంది. దాంతో సభ రసాభాసగా మారగా పోలీసులు జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది. అయితే వీణ‌వంక మండ‌లంలో ఈట‌ల‌కు మంచి క్యాడ‌ర్ ఉంది. అయితే ఆ క్యాడ‌ర్ ను టీఆర్ఎస్‌ తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేయగా… టీఆర్ఎస్‌కు పెద్ద షాకే తగిలిందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది.