మెగాస్టార్ చిరంజీవి కొత్త వివాదంలో ఇరుక్కున్నారు.గతంలో కన్నా ఇప్పుడాయన మీడియాపై కాస్త ఎక్కువగానే కోపంగా ఉన్నారు. గతంలో కూడా మీడియాతో మెగా కుటుంబానికి కొన్ని వివాదాలున్నాయి.అసత్య వార్తా కథనాలపై గతంలో పవన్ కూడా ఫైర్ అయిన సంగతి తెలిసిందే! ఇప్పుడు తమ్ముడి బాటలో అన్నయ్య నడిచి పెద్ద చర్చకే తెరలేపారు. గివ్ న్యూస్ నాట్ వ్యూస్ పేరిట ఓ ట్రెండ్ టాపిక్ ట్విటర్ లోకి తీసుకువచ్చి, ఆ మాటకు ఓ హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేసి డిజిటల్ మాధ్యమాల్లో ట్రోల్ చేయిస్తున్నారు.
ముఖ్యంగా ఎప్పటి నుంచో ఉన్న వివాదం కావడంతో చాలా మంది సెలబ్ లు పైకి ఎలా ఉన్నా లోపల మాత్రం అంతర్మథనం చెందుతున్నారు. ఏం చెప్పినా ఏం చేసినా మీడియాతో తంటే అన్న విధంగా ఇప్పుడున్న కాలంలో చాలా మార్పులు జరుగుతున్న పరిణామాలపై ప్రభావం చూపిస్తున్నాయి. అందుకే చాలా మంది మాట్లాడేందుకు కనీసం స్టూడియోల్లోకి వచ్చి తమ వాదన చెప్పుకునేందుకు ఇష్టపడడం లేదు. ఒకవేళ లైవ్ లోకి వచ్చి వివరణ ఇచ్చినా కూడా తరువాత చేసే స్టోరీలలో సొంత భావజాలం ఒక్కటి తెరపైకి తెస్తున్నారు. దాంతో వివాదాలు పెరిగి పెద్దవి అయిపోతున్నాయి.
ఒకరు కాకున్నా ఇంకొకరు అయినా ఇవాళ రాయక తప్పడం లేదు. డిజిటల్ మాధ్యమాల నుంచి ఓ అసహజ పోటీ నెలకొని ఉంది. దీంతో ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాలు కూడా వాటినే ఆధారంగా చేసుకుని నాలుగు వార్తలు అందించాల్సి వస్తోంది. ఇది నిజంగా ఓ దౌర్భాగ్యం. కొన్ని విషయాల్లో సోషల్ మీడియా అప్ డేట్స్ ను వార్తలుగా మార్చడం మంచిదే కానీ ఓ చిన్న లీక్ ను పట్టుకుని వార్తలు రాసి, తెగ హల్ చల్ చేయడంలో భావ్యం లేదు.ఇదే చిరు మనసును కలవరపెడుతోంది. అలా అని పూర్తిగా మీడియాను ఆయన దూరం పెట్టలేరు. ఒకవేళ ఎవరినైనా పిలిపించి మాట్లాడితే ఆ ఒక్క సందర్భంలో చెప్పిన నాలుగు మంచి మాటలు వదిలి, అందులో కూడా కాంట్రవర్శీలు వెతుకుతున్నారు.దీంతో వివాదాలు చిలువలు పలువులుగా మారి తలనొప్పిగా పరిణమిస్తున్నాయి.