తెలంగాణ నుంచి సోనియాగాంధీ పోటీ….ఓటర్లు ఆదరిస్తారా.?

-

తెలంగాణ నుంచి లోక్ సభకు సోనియా గాంధీ పోటీ చేయనుందా…ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయొచ్చు..? ఎన్ని నియోజకవర్గాలు ఆమె కోసం రిజర్వ్ లో ఉన్నాయి…? సార్వత్రిక ఎన్నికలు దగ్గరికొచ్చిన ప్రతిసారీ చర్చకు వచ్చే అంశం ఇది. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ ఈ అంశం తెరమీదకు వచ్చింది. కాదు… కాదు… కాంగ్రెస్ నేతలే ఆ చర్చను తీసుకువచ్చారు. అసలు సోనియాగాంధీకి సౌత్ నుంచి పోటీ చేయాల్సిన ఆసక్తి, అవసరం ఉందా..? ఒకవేళ పోటీ చేస్తే ఎక్కడి నుంచి పోటీ చేస్తారు..?పోటీ చేస్తే తెలంగాణ ప్రజలు ఆమెను ఏ ఏ అంశాల ఆధారంగా గెలిపిస్తారు… అసలు సోనియా గెలిచే అవకాశం ఉందా..?అంటే ఇవన్నీ సమాధానం లేని ప్రశ్నలు.

తెలంగాణా నుంచి సోనియా గాంధీ ఎంపీగా పోటీ చేస్తే ఆ ప్రభావంతో మరిన్ని ఎంపీ సీట్లు గెలవచ్చన్నది కాంగ్రెస్ నేతల ఆశ. ఈ ప్రభావం ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే కాదు దక్షిణాది రాష్ట్రాల మీద ఉంటుందని వారు భావిస్తున్నారు.కేంద్రంలో పాగా వేయాలంటే ఇలాంటి అద్భుతం ఒకటి జరగాలని వారు కోరుకుంటున్నారు. ఈ మేరకు టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాల్లో సోనియా పోటీ అంశాన్ని కూడా చేర్చారు. ఆమెకోసం నాలుగు కీలక నియోజకవర్గాలను కూడా డిసైడ్ చేసేసారు. అందులో మొదటిది మల్కాజ్ గిరి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిట్టింగ్ స్థానం ఇది.2019 లోక్ సభ ఎన్నికల్లో ఇక్కడినుంచి రేవంత్ ఎంపీగా గెలిచారు.ఇప్పుడు సీఎం అయ్యాక ఆయన రాజీనామా చేశారు. ఇక్కడ రేవంత్ కి పట్టు ఉండటం, రాష్ట్రంలో పార్టీ అధికారం లో ఉండటంతో ఖచ్చితంగా సోనియాగాంధీ గెలుస్తుందని ఇక్కడి నేతలు భావిస్తున్నారు. ఓవైపు రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీలో అధికారంలో ఉండడం.. మరోవైపు రేవంత్‌రెడ్డి సిట్టింగ్ స్థానం కావడంతో ఇక్కడ సోనియా గెలుపు సునాయాసమని చెబుతున్నారు.

ఇక కాంగ్రెస్ చెప్పిన రెండో ఆప్షన్‌ మెదక్ లోక్ సభ నియోజకవర్గం.1980లో మెదక్ నుంచి ఇందిరా గాంధీ పోటీ చేసి గెలిచారు. మొత్తం 301577 ఓట్లు ఆమెకు రాగా తన ప్రత్యర్థి జైపాల్ రెడ్డి పై 219124 ఓట్ల భారీ మెజారిటీ దక్కింది.ఇందిరమ్మ ప్రచారం చేయకపోయినా అప్పట్లో ప్రజలు ఆమెకు భారీ మెజారిటీ ఇచ్చారు. అంతేకాదు ఇందిరమ్మ ప్రభావంతో ఉమ్మడి ఏపీలో ఏకంగా 41 యంపీ సీట్లు గెలుచుకుంది కాంగ్రెస్.తెలంగాణ ఇచ్చింది సోనియా అని చెప్తున్న కాంగ్రెస్ నేతలు ఆనాటి కరీంనగర్ సభను గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ఆ సభలోనే సోనియా తెలంగాణ ఇస్తామని ప్రకటన చేసింది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్‌కు, తెలంగాణ ఇచ్చిన లీడర్‌గా సోనియాగాంధీకి పేరుంది కనుక కరీంనగర్‌ నుంచి పోటీ చేసినా సోనియా గాంధీ గెలుస్తారని చెబుతున్నాయి పార్టీ శ్రేణులు. ఇక నాలుగో పార్లమెంట్ స్థానం చేవెళ్ల. ఈ లోక్‌సభ నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు బలం, బలగం మొండుగా ఉంది. పైగా చేవెళ్ల ప్రాంతం కాంగ్రెస్ పార్టీకి సెంటిమెంట్.ఈ పార్లమెంట్‌ నియోజకవర్గం ఇన్‌చార్జ్‌గా సీఎం రేవంత్‌రెడ్డి ఉన్నారు.సోనియా గాంధీ గనక చేవెళ్ల నుంచి పోటీ చేస్తే గెలుపు తధ్యమని చెబుతున్నారు.

1980లో ఇందిరమ్మకు ఓటు వేసిన వారిలో చాలామంది ఇప్పుడు లేరు.అప్పటితో పోలిస్తే ఇప్పుడు రాజకీయం గా పరిస్థితులు పూర్తిగా మారాయి. అప్పట్లో ఇందిరమ్మ ప్రచారానికి రాకపోయినా ప్రజలు గెలిపించారు. కానీ ఇప్పుడు పదే పదే కనిపించినా ఓట్లు పడటం లేదు.అభివృద్ధి, సంక్షేమానికి ఎవరు ప్రాధాన్యత ఇస్తారో వారికే పట్టం కడుతున్నారు.అంటే ప్రతి అంశాన్ని ప్రజలు నిశితంగా గమనిస్తూనే ఉన్నారు. ఇక ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాతీర్పు ఏకపక్షంగా కాంగ్రెస్ కి పూర్తి అనుకూలంగా ఏమీ లేదు. అధికారానికి కావలసిన సీట్లను మాత్రమే కాంగ్రెస్ గెలుచుకుంది. ఇది పొరపాటున దక్కిన విజయమే తప్ప ప్రజలు కాంగ్రెస్ వైపు పూర్తిగా లేరన్నది తలపండిన వ్యక్తులు చెప్తున్న మాట. ఇప్పటికీ ఈ విజయాన్ని నమ్మలేకపోతున్నామని కాంగ్రెస్ లోని సీనియర్ వ్యక్తులే ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సోనియాగాంధీ ని తీసుకువచ్చి ఇక్కడ పోటీకి పెడితే…ఓటమిని కొని తెచ్చుకుని ఉన్న కొంచెం పరువును పోగొట్టుకోవడమే అవుతుందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్న మాట. తెలంగాణ సాధించుకు తెచ్చిన కె చంద్రశేఖర్ రావు రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తే ఒక స్థానంలో ఓటమి ఎదురైంది. మరి తెలంగాణ ఇచ్చింది సోనియా అని చెప్తే గంప గుత్తగా ఓట్లు పడతాయని అనుకోవడం పొరపాటే అవుతుందని అంటున్నారు.సోనియా ని తెలంగాణ ప్రజలు విశ్వసించి ఉంటే పదేళ్లు అధికారానికి కాంగ్రెస్ ని ఎందుకు దూరం పెట్టారో ఇప్పుడున్న నేతలు ఆలోచించుకోవాలి.తెలంగాణ ఏర్పడ్డాక జరిగిన ఎన్నికల్లో మెజారిటీ సీట్లు కాంగ్రెస్ గెలుచుకోలేకపోయింది. ఇప్పుడు అధికారం లోకి వచ్చాక ఆరు గ్యారంటీలను అమలు చేయడానికి నిధుల కోసం నానా తంటాలు పడుతున్నారు. అప్పుడే అప్పులు చేస్తూ పరిపాలనలో వైఫల్యాలను ఎదుర్కొంటున్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కేడర్ ని కాస్త ఉత్సాహపరచడానికి పీసీసీ ఇలాంటి ఆలోచనలు చేస్తుంది తప్ప నిజంగా సోనియా ఇక్కడ నుంచి పోటీ చేయరు అనేది పీసీసీ వర్గాలకు కూడా తెలుసు. ఇవన్నీ దృష్టిని మళ్లించడానికేనని తెలుసుకోలేనంత అమాయకంగా ప్రజలు లేరని విశ్లేషకులు చెపుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news