సుజనా చౌదరి.. రాజకీయాల్లోకి వచ్చిన పారిశ్రామిక వేత్త.. తెలుగు దేశం పార్టీకి మొదటి నుంచి ఆర్థికంగా అండదండలదించిన వ్యక్తి.. ఆ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆర్థికంగా ఆదుకున్న వ్యక్తి. ఆ కృతజ్ఞతతోనే చంద్రబాబు ఆయన్ను రెండు సార్లు ఎంపీగా చేశారు. ఓసారి ఏకంగా కేంద్రమంత్రినే చేశారు.
తెలుగు దేశంలో సుజనా చౌదరి వంటి కార్పోరేట్లుకు ప్రాధాన్యం ఇస్తున్నారని చాలామంది సిసలైన నాయకులు పార్టీకి దూరమైనా కూడా చంద్రబాబు వీరికి బాగానే ప్రయారిటీ ఇచ్చారు. కానీ అలాంటి సుజనా చౌదరి మొన్నటి ఎన్నికల తర్వాత అనూహ్యంగా బీజేపీ పంచన చేరారు. అనుకోని షాక్ ఇచ్చారు. అయితే ఇదంతా చంద్రబాబు ఆడిస్తున్న నాటకమే అని.. కొందరు విశ్లేషిస్తుంటారు.
తెర వెనక వ్యవహారాలు ఎలా ఉన్నా.. ఇప్పుడు సుజనా చౌదరి బీజేపీ నాయకుడు. కానీ పార్టీ మారిన తర్వాత కూడా సుజనా చౌదరి వ్యవహారశైలి టీడీపీ నాయకుడిలాగానే ఉంటోంది తప్పించి బీజేపీ వ్యక్తిలా ఉండటం లేదన్న విమర్శలు బాగా వస్తున్నాయి. ప్రత్యేకించి ఆయన చేసే విమర్శలన్నీ కూడా టీడీపీ వాదనలే కావడం విశేషం.
రాజధాని అమరావతి విషయంలోనూ.. పోలవరం టెండర్ల విషయంలోనూ.. పీపీఏల విషయంలోనూ.. ఇలా ఏ విషయం చూసుకున్నా సుజనా చౌదరి అచ్చనైన టీడీపీ నాయకుడిలాగానే మాట్లాడుతున్నారు. గతంలో పోలవరంపై బీజేపీ ఎన్నో విమర్శలు చేసింది. చంద్రబాబు అడ్డంగా దోచుకుంటున్నారని మాట్లాడింది. కానీ ఇప్పుడు సుజనా చౌదరి మాత్రం రివర్స్ టెండరింగ్ ను వ్యతిరేకిస్తున్నారు. ఇవన్నీ చూస్తే ఇంతకీ సుజనా చౌదరి టీడీపీనా.. బీజేపీనా అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు.