మళ్లీ వంటిళ్లలో.. పేలుతున్న ఆ బాంబులు.. ?

-

అవును..మళ్లీ అందరి ఇళ్లలో బాంబులు పేలబోతున్నాయి. అయితే ఇవి అలాంటి ఇలాంటి బాంబులు కావు.. ఉల్లి బాంబులు.. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు భారీగా పెరుగుతున్నాయి. గతంలో ప్రభుత్వాలనే మార్చిన చరిత్ర ఈ ఉల్లి ధరలకు ఉంది. ఉల్లిపాయ లేకుండా వంటింట్లో ఏ పనీ ముందుకు కదలదు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉల్లిధర ఘాటెత్తింది. కోసే ఆడాళ్లకే కాదు.. కొనే మగాళ్లకూ కంటనీరు పెట్టిస్తోంది. కిలో 70 నుంచి 80 రూపాయలకు పలుకుతూ సాధారణ ప్రజలకు భారంగా మారుతోంది. వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వశాఖ లెక్కల ప్రకారం గతవారం ప్రారంభంలో కిలో 50 నుంచి 60 రూపాయల వరకూ ఉండేది. ప్రస్తుతం దీని ధర వారాంతానికి 70 నుంచి 80 రూపాయలకు చేరుకుంది.

అందుకే ఉల్లి ధరలను కట్టడి చేయాలని భావించిన కేంద్రం చర్యలకు ఉపక్రమించింది. ఉల్లినిల్వలపై ఆంక్షలు విధించాలని కేంద్రం భావిస్తోందట. మరి ఇంతకీ ఉల్లి రేటు ఎందుకు ఇంతగా పెరిగిందంటే.. ఉల్లిని అధికంగా పండించే రాష్ట్రాలలో భారీవర్షాలు వచ్చాయి. దిగుబడి బాగా పడిపోయింది.

మరి దిగుబడి తగ్గినప్పుడు.. రేట్లు పెరగడం సహజమే కదా.. దీనికితోడు ఉల్లి నిల్వలు ఉన్న వ్యాపారులు ఇదే అదనుగా రేట్లు అమాంతం పెంచేస్తున్నారు. అందుకే వ్యాపారస్తుల వద్దనున్న ఉల్లి నిల్వలపై ఆంక్షలు విధించాలని కేంద్రం భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

చుక్కలు చూపిస్తున్న ఉల్లి ధరలను ఆకాశం నుంచి దించేందుకు మార్కెట్లలోకి ఉల్లిసరఫరాను పెంచాలని కూడా నిర్ణయించింది. అయితే దిగుబడి తక్కువ ఉన్నప్పుడు ఎన్ని చర్యలు తీసుకున్నా జనం జేబులకు చిల్లులు ఖాయం. కాకపోతే.. ఆ చిల్లి ఏ స్థాయిలో ఉంటుందన్నదే ఇప్పుడు తేలాల్సిన విషయం.

Read more RELATED
Recommended to you

Latest news