వివాదాస్పదంగా మారిన CAA బిల్లు విషయంలో బిజెపి వెనక్కు తగ్గే పరిస్థితులు ఎక్కడా కనపడటం లేదు. రాజకీయంగా బిజెపి బలంగా ఉండటంతో ప్రతిపక్షాల వాదన అనేది ప్రజల్లోకి వెళ్ళడం లేదు. దేశ వ్యాప్తంగా మద్దతు కోసం బిజెపి ప్రయత్నాలు చేస్తుంది. ముఖ్యంగా బెంగాల్, కేరళ సహా అనేక రాష్ట్రాలు ఈ విషయంలో కేంద్రానికి షాక్ ఇవ్వడంతో ఇప్పుడు మద్దతు కోసం ప్రయత్నాలు చేస్తుంది బిజెపి.
ఈ నేపధ్యంలో రెండ్రోజుల బెంగాల్ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ హౌరాలోని రామకృష్ణ మిషన్ ప్రధాన కేంద్రమైన బెలూర్ మఠానికి వెళ్ళారు. స్వామీ వివేకానంద జయంతి సందర్భంగా మోదీ, దేశ యువతను ఉద్దేశించి కీలక ప్రసంగం చేస్తూ పౌరసత్వ సవరణ విషయంలో ప్రజలకు అనవసర అపోహలు వద్దని, ప్రతిపక్షాలు దీనిపై ద్వంద్వార్థాలు తీసి… ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నాయని విమర్శించారు.
ఈ వ్యాఖ్యలపై రామకృష్ణ మిషన్ ప్రధాన కార్యదర్శి స్వామి సువిరానంద స్పందించలేదు. మోదీ ఓ అతిథిగా వచ్చారనీ, ఆయన మాట్లాడకూడని మాట్లాడితే దానికి తాము బాధ్యులం కాదనీ అలాంటి వ్యాఖ్యలపై బాధ్యత ఆతిథ్యం ఇచ్చేవారికి ఉండదని స్పష్టం చేసారు. తమది రాజకీయాలతో సంబంధం లేని సంస్థ అని, తమ సంస్థలో అన్ని మతాలవారూ ఉన్నారనీ, అందరూ సోదరుల్లా ఉంటారన్నారు. ఆ తర్వాత మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు.