ఎప్పుడూ అధికారంలో ఉండాలని కొందరు రాజకీయ నేతలు కోరుకుంటారు. ప్రభుత్వంలో ఉంటే వ్యాపారాలను చక్కపెట్టుకోవడమే కాదు ప్రజలకు నిరంతర సేవలు చేయవచ్చు. ఈ కోవకి చెందిన వ్యక్తి తలసాని శ్రీనివాస్ యాదవ్. తెలుగుదేశం పార్టీ నుంచి బీఆర్ఎస్ కి వచ్చిన ఆయన పదేళ్ళపాటు మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు ఆపార్టీ ఓడిపోయినా ఆయన మాత్రం మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రతిపక్షంలో ఉండటం ఇష్టం లేని ఆయన ఎలాగైనా మంత్రి అవ్వాలని ప్రయత్నాలు చేస్తున్నారు.
కాంగ్రెస్ లోకి వస్తానని మంత్రి పదవి ఇవ్వాలని తలసాని పంపిన రాయబారాన్ని రేవంత్ రెడ్డి తిరస్కరించారని అయితే తలసాని మాత్రం ఇంకా ప్రయత్నాలు మానలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి మంత్రి పదవులు ఇవ్వరాదని ఏఐసీసీ నిబంధన పెట్టింది. దీంతో తలసాని ఎలాగైనా కాంగ్రెస్ లో చేరి మంత్రి పదవి కొట్టేయాలని మరో విధంగా ప్రయత్నాలు మొదలుపెట్టారు.
ఇండియా కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్నారు సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్. తలసాని కూడా అదే సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కావడంతో అఖిలేష్ తో రాయబారం నడుపుతున్నారు. ఇందులో భాగంగా తలసాని ఇటీవల అఖిలేష్ తో సమావేశమయ్యారని సమాచారం. సనత్ నగర్ నుంచి గెలిచిన తలసాని.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ ను బలోపేతం చేస్తామని.. తనకు మంత్రి పదవి ఇప్పించేందుకు సహకరించాలనే ప్రతిపాదన అఖిలేష్ ముందు పెట్టారని తెలుస్తోంది. దీనిపై సానుకూలంగా స్పందించిన అఖిలేష్.. ఈ విషయంలో రాహుల్ పై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తానని భరోసా ఇచ్చారట. అందుకే తలసాని మీడియా ముందుకు రాకుండా.. ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా సైలెంట్ గా ఉన్నారని అంటున్నారు.
ఇక తలసానికి భరోసా ఇచ్చిన అఖిలేష్ యాదవ్ ఆ దిశగా ప్రయత్నాలు కూడా మొదలుపెట్టారని తెలంగాణ కాంగ్రెస్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇండియా కూటమి లో కీలక వ్యక్తిగా ఉన్నారు అఖిలేష్ యాదవ్. ఇప్పుడు రాహుల్ కి అఖిలేష్ కి మధ్య మంచి సాన్నిహిత్యం కూడా ఏర్పడింది. దీంతో తలసాని కోరుకున్నది త్వరలో నెరవేరుతుందని ఆయన అనుచరులు సైతం పాజిటివ్ గా ఉన్నారు.
అఖిలేష్ రాయబారం ఫలించి కాంగ్రెస్ హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే తలసాని కాంగ్రెస్ పార్టీలో చేరిపోయే అవకాశం ఉంది. అయితే మంత్రి పదవి ఇస్తేనే ఆయన పార్టీ మారాలి అనుకుంటున్నారు. కానీ మంత్రి పదవుల కోసమే కాంగ్రెస్ లో యుద్ధమే జరుగుతోంది. మంత్రి పదవి హామీతోనే పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పంచన చేరారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనే ఉత్కంఠ కూడా ఏర్పడింది. ఫైనల్ గా తలసాని మంత్రి అయ్యే కలను అఖిలేష్ నెరవేరుస్తాడో లేదో చూడాలి మరి.