గత కొన్ని రోజులుగా తమ ఎన్నికల మేనిఫెస్టోను కాపీ కొట్టారంటూ వైసీపీ నేతలు చంద్రబాబుపై విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో వాటికి బలం చేకూరుస్తూ చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశాడు ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చంద్రబాబు ఓటర్లను ఆకర్షించడానికి ఫించన్ల పెంపు, నిరుద్యోగ భృతి, ఇక పథకాలకు రూపకల్పన చేశారు. దీనిపై స్పందించిన తమ్మారెడ్డి… ప్రజలను మభ్యపెట్టే పథకాలు, మోసం చేసే పథకాలు కాదు.. ప్రభుత్వాలు నిజాయితీగా ప్రజల బాగు కోసం పనిచేయాలని తెలిపారు. నా ఆలోచన.. అనే యూట్యూబ్ చానెల్ లో ఏపీ రాజకీయాలపై ఆయన మాట్లాడిన వీడియోను అప్ లోడ్ చేశారు.
ఏపీలో ఎన్నికలు దగ్గరికి వస్తున్నాయి. ఎన్నికలంటే ఐదేళ్ల భవిష్యత్తు. కానీ.. ఆ భవిష్యత్తుతో మన రాజకీయ నాయకులు ఆటలాడుకుంటున్నారు. మన భవిష్యత్తుపై కామెడీ చేస్తున్నారు. ఎన్నికల వేళ కాబట్టి.. జగన్ తన మేనిఫెస్టోలో పింఛన్లు పెంచుతా అని చెప్పారు. ఇంకేదో చెప్పారు. ఇప్పుడు జగన్ చెప్పిన హామీలన్నింటినీ… ఎన్నికల ముందే అమలు చేసేశారు చంద్రబాబు. జగన్ హామీలను చంద్రబాబు హామీ చేయడం ఏంటి. ఆయన హామీలను కాపీ కొట్టడం ఏంది. రైతు రుణమాఫీ కూడా చేస్తామంటున్నాడు చంద్రబాబు. కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా చేస్తా అంటున్నాడు బాబు. మరి.. కేంద్రంతో చంద్రబాబు గత నాలుగేళ్లు రాసుకుపూసుకు తిరిగినప్పుడు రైతు రుణ మాఫీ గురించి ఎందుకు మాట్లాడలేదు. గత నాలుగేళ్లలో ఎందుకు పెన్షన్ డబుల్ చేయలేదు. ఇదంతా ఎన్నికల స్టంట్.
ఎన్టీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కూడా రెండు రూపాయలకు కిలో బియ్యం పథకాన్ని తీసుకొచ్చినప్పుడు… తర్వాత కాంగ్రెస్ పార్టీ రూపాయిన్నరకే బియ్యం ఇచ్చింది. కానీ.. ఏమైంది. ఎలక్షన్ల ముందు కాంగ్రెస్ పార్టీ చేసిన స్టంట్ ను ప్రజలు నమ్మలేదు. కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించి ఎన్టీరామారావును గెలిపించారు.. అంటూ తమ్మారెడ్డి చంద్రబాబుపై ఫైర్ అయ్యారు.
ఏదన్నా ఒక పార్టీ మేనిఫెస్టోను రిలీజ్ చేసినప్పుడు… ఆ పార్టీ కంటే ముందే అధికారంలో ఉన్న పార్టీ అమలు చేసేసి.. సంకలు గుద్దుకొని.. తమకే ప్రజలు పట్టం కడతారు అని అనుకుంటే మాత్రం నేను నమ్మను. అది కరెక్ట్ కాదు. అది నిజాయితీ అనిపించుకోదు. ప్రజలు తామెంతిచ్చాము.. వాళ్లెంత ఇస్తున్నారు.. కాదు.. అసలు ప్రజలు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి కదా. చంద్రబాబు పెన్షన్ పథకం కూడా అలాగే ఉంది.. అంటూ వీడియోలో తెలిపారు తమ్మారెడ్డి.