రాజాన‌గ‌రంలో టీడీపీ – జ‌న‌సేన పొత్తు చిత్తే…!

-

టిడిపితో పొత్తు ఉంటుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అయితే క్షేత్రస్థాయిలో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఉన్నా ఓట్ల బదిలీ జరుగుతుందా అంటే ? చెప్పలేని పరిస్థితి. చాలా నియోజకవర్గాలలో క్షేత్రస్థాయిలో పరిశీలన ప్రకారం జనసేన – పవన్ అభిమానులు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు ఎంతవరకు ఓట్లు వేస్తారు ? అన్నది చెప్పలేని పరిస్థితి. ఇటు తెలుగుదేశం పార్టీని బలంగా అభిమానించే ఓ సామాజిక వర్గ ఓటర్లతో పాటు.. ఆ పార్టీకి సంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉన్నవారు సైతం తమ పార్టీ గుర్తు లేకుండా జనసేన గుర్తు ఉన్నచోట ఆ పార్టీకి ఓట్లు వేస్తారా అంటే సందేహంగానే కనిపిస్తుంది.

ఉదాహరణకు తూర్పుగోదావరి జిల్లాలో రాజానగరం నియోజకవర్గంలో ఈ పొత్తు చిత్తయ్యలా కనిపిస్తోంది. ఇక్కడ జనసేన నుంచి ఆర్థికంగా బలంగా ఉన్న బ‌త్తుల బలరామకృష్ణ ఇన్చార్జిగా ఉన్నారు. వచ్చే ఎన్నికలలో తనకే టికెట్ ఖాయం అని ఆయన ఇప్పటికే ప్రకటించేసుకున్నారు. కొద్ది రోజుల క్రితమే పవన్ కళ్యాణ్ ఆయనకు నియోజకవర్గ ఇన్చార్జి పగ్గాలు అప్పగించారు. ఇక నెల రోజుల క్రితమే తెలుగుదేశం పార్టీకి పెద్దాపురానికి చెందిన బొడ్డు వెంకటరమణ చౌదరి ఇన్చార్జిగా వచ్చారు. అటు జనసేన ఇన్చార్జి.. ఇటు టిడిపి ఇన్చార్జ్ ఇద్దరు టిక్కెట్ తమదే అని చెప్పుకుంటున్నారు.

పైగా టిడిపి నేత వెంకటరమణ చౌదరి త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం ( గ‌తంలో తండ్రి భాస్క‌ర రామారావు ఎమ్మెల్యేగా గెలిచిన‌) పెద్దాపురం టికెట్ ఆశించి నిరాశకు గురయ్యారు. చంద్రబాబు టిక్కెట్ కచ్చితంగా నీదే అని చెప్పి మరి రాజానగరం ఇన్చార్జి పగ్గాలు అప్పగించారు. ఇప్పుడు టిడిపి ఆయనను తప్పించే పరిస్థితి లేదు. ఇటు జనసేన నాయకుడు బత్తుల బలరామకృష్ణ సైతం సామాజికంగా ఆర్థికంగా, బలమైన వ్యక్తిగా ఉన్నారు. ఆయన కూడా గత కొద్ది నెలలుగా మంచి నీళ్ల‌లా డబ్బు ఖర్చు పెడుతూ పార్టీ కోసం కష్టపడుతున్నారు.

ఈ ఇద్దరు నేతలు సామాజిక వర్గాలపరంగా భిన్నమైన నేపథ్యం ఉన్నవారు. టిడిపి నేత వెంకటరమణ చౌదరి కమ్మ సామాజిక వర్గం నేతకాగా.. జనసేన నేత బత్తుల కాపు సామాజిక వర్గానికి చెందినవారు. అయితే నియోజకవర్గంలో ఉన్న ప్రత్యేకమైన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడ జనసేనకు సీటు ఇస్తే.. కమ్మ సామాజిక వర్గంతో పాటు టిడిపి సాంప్రదాయ ఓటర్లు జనసేనకు ఓట్లు వేసే పరిస్థితి లేదు. వైసీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ప్రత్యేకించి కమ్మ సామాజిక వర్గంతో ఎంతో అనుబంధం కొనసాగిస్తూ వస్తున్నారు.

నియోజకవర్గంలో కీలకమైన సీతానగరం మండలంలో జడ్పిటిసి తో పాటు మండల పార్టీ పదవులు అన్ని ఇదే సామాజిక వర్గానికి కేటాయించారు. దీనికి తోడు రాజా తండ్రి, దివంగ‌త మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు ఉన్నప్పటి నుంచి ఆయన ఫాలోవర్లుగా ఉన్న నేతలు అందరూ కూడా పార్టీలకు అతీతంగా రాజాకు మద్దతు పలుకుతున్న పరిస్థితి. విచిత్రం ఏంటంటే తెలుగుదేశంలో కీలక నేతలుగా ఉన్నవారు సైతం తమ పార్టీకి కాకుండా జనసేనకు పొత్తులో భాగంగా రాజానగరం సీటు ఇస్తే ఎట్టి పరిస్థితుల్లో సహకరించమని తేల్చి చెబుతున్నారు.

అయితే జనసేనకు నియోజకవర్గంలో చెప్పుకోదగ్గ ఓటు బ్యాంకు ఉంది. వెంకటరమణ చౌదరి ఇప్పటికే నాన్ లోకల్ అన్న ముద్ర పడిపోయింది. ఆయనకు సీటు ఇస్తే ఖచ్చితంగా రాజానగరం సీటు తమదే అని బల్ల గుద్ది చెబుతున్న జనసేన కేడర్ పూర్తిగా సహకరించే పరిస్థితి లేదు. ఏది ఏమైనా తూర్పుగోదావరి జిల్లాలోనే ఏడెనిమిది నియోజకవర్గాలలో రెండు పార్టీల మధ్య పొత్తు ఉన్నా క్షేత్రస్థాయిలో ఓట్ల బదిలీ అయితే కచ్చితంగా జరుగుతుందన్న గ్యారెంటీ లేదు.

2014 ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌కుండా టీడీపీకి స‌పోర్ట్ చేశారు. దీంతో జ‌న‌సేన వాళ్లు పోటీలో లేరు కాబ‌ట్టి స‌రిపోయింది. గ‌త ఎన్నిక‌ల్లో వేరువేరుగా పోటీ చేస్తే రెండు పార్టీలు చిత్త‌య్యాయి. ఇప్పుడు ఎవ‌రికి వారు తామే పోటీ చేయాల‌ని అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో కంకణం క‌ట్టుకుని ఉన్నారు. ఈ నేప‌థ్యంలో ఒక పార్టీ పోటీ చేసిన చోట మ‌రో పార్టీ కేడ‌ర్‌, నేత‌లు, టిక్కెట్లు ద‌క్క‌ని వారు ఎట్టి ప‌రిస్థితుల్లోనూ స‌హ‌క‌రించే ప‌రిస్థితి లేదు.

Read more RELATED
Recommended to you

Latest news