గత కొన్ని రోజులుగా జిల్లాల పర్యటనలతో బిజీగా ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కార్యాలయాల సముదాయం, తెరాస జిల్లా నూతన కార్యాలయాలను ఇవాళ మధ్యాహ్నం కేసీఆర్ ప్రారంభించనున్నారు. అనంతరం జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ కళాశాల మైదానంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. సభకు భారీ జనసమీకరణ కోసం ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు రెండు రోజులుగా తమ నియోజకవర్గాల్లో పర్యటించి సమావేశాలు నిర్వహించారు.
ముఖ్యంత్రి కేసీఆర్ రాకతో జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు బహిరంగ సభ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. భారీ స్థాయిలో జన సమీకరణ చేసి విజయవంతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. జిల్లా తెరాస శ్రేణుల్లో నూతనోత్తేజం నింపేలా సభ ఉండబోతోందని మంత్రి, ఎమ్మెల్యేలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సభ ఏర్పాట్లను పరిశీలించారు. నిజామాబాద్ భారీ బహిరంగ సభ న భూతో న భవిష్యత్ అనేలా ఉంటుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.