తెలంగాణ‌లో స్థానిక స‌మ‌రం… గెలుపు డిసైడ్ అయ్యిందా..!

-

తెలంగాణ‌లో స్థానిక స‌మ‌రం ప్రారంభ‌మైంది. స్థానిక ఎన్నిక‌ల్లో ప‌ట్టు సాధించేందుకు అధికార టీఆర్ ఎస్ స‌హా ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షాలైన కాంగ్రెస్‌, బీజేపీలు కూడా వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నాయి. ఇక‌, చిన్నా చిత‌కాపార్టీలైన జ‌న‌సేన‌, టీడీపీల్లో జ‌న‌సేన ఇప్ప‌టికే పోటీ నుంచి త‌ప్పుకోవ‌డం.. టీడీపీ ఉన్నా ప్ర‌భావం చూపించే ప‌రిస్తితి లేక‌పోవ‌డం ప్ర‌ధాన పోరు మాత్రం కాంగ్రెస్‌-బీజేపీ-టీఆర్ ఎస్‌ల మ‌ధ్యే జ‌ర‌గ‌నుంది. దీంతో అదికార పార్టీపై ప్ర‌తిప‌క్షాలు వ్యూహాత్మ‌క‌దాడులు చేయ‌డం ప్రారంభించాయి. ఈ క్ర‌మంలోనే కొన్నాళ్ల కింద‌ట ఆర్టీసీ సమ్మెను వినియోగించుకుందామ‌ని చూసినా.. స‌మ్మెను ఎంత‌గా అణిచేశాడో.. సీఎం కేసీఆర్‌.. త‌ర్వాత కార్మికుల‌పై అంతే రేంజ్‌లో వ‌రాలు కురిపించారు. దీంతో ఇది ప్ర‌తిప‌క్షాల‌కు క‌లిసి రాలేదు.

ఇక‌, మిగిలింది.. సీఎం కేసీఆర్‌.. ఆర్థికంగా బాగున్న రాష్ట్రాన్ని అప్పుల గుండంలోకి నెట్టార‌నే విమ‌ర్శ‌లు చేయ‌డ‌మే! ఇప్పుడు వీటినే ప‌ట్టుకుని బీజేపీ, కాంగ్రెస్ నాయ‌కులు వేలాడుతున్నారు. అయితే, కాంగ్రెస్ లో నేత‌ల మ‌ద్య ఆధిప‌త్య ధోర‌ణి ఎక్కువ‌గా క‌నిపిస్తుండ‌డంతో ఎవ‌రికి వారే ప్ర‌చారంలో దూకుడు ప్ర‌ద ర్శిస్తున్నారు. పీసీసీ రేసులో ఉన్న నాయ‌కులు ఎవ‌రికి వారుగా బ‌ల ప్ర‌ద‌ర్శ‌న‌కు దిగుతున్నారు. ఈ క్ర‌మం లో పార్టీ నేత‌లు ఏం మాట్లాడుతున్నారో అర్ధం కావ‌డం లేదు. ఇక‌, బీజేపీ ఏం మాట్లాడినా.. బూమ‌రాంగ్ మాదిరిగా వారికే అది ఎదురు తిరుగుతున్న ప‌రిస్తితి ఏర్ప‌డింది. రాష్ట్రంలోఎక్క‌డి ప‌నులు అక్క‌డే ఉన్నాయి.. అభివృద్ధి జ‌ర‌గ‌డం లేద‌ని విమ‌ర్శించేందుకు జంకుతున్నారు.

దీనికి ప్ర‌దాన కార‌ణం.. అధికార పార్టీ టీఆర్ ఎస్ నేత‌లు.. ఈ విమ‌ర్శ‌ల‌కు ఘాటైన విమ‌ర్శ‌లు చేస్తున్నా రు. కేంద్రం నుంచి జీఎస్టీ వాటా ఇవ్వ‌కుండా తొక్కి పెట్టుకున్నది బీజేపీ నేత‌లేన‌ని, వారివ‌ల్లే రాష్ట్రం అభివృద్ధికి నోచుకోవడం లేద‌ని, వారికి త‌రిమి కొట్టాల‌ని పిలుపునిస్తున్నారు. మ‌రోప‌క్క‌, అభివృద్ధి ప‌నుల‌కు ఏడాది త‌ర్వాత టీఆర్ ఎస్ శంకు స్థాప‌న‌లు చేస్తోంది. ఎన్నికల ముందు వార్డుల్లో శంకుస్థాపనలు చేసేందుకు అధికార పార్టీ ఎమ్మెల్యేలు సిద్ధమయ్యారు. మున్సిపల్ ఎన్నికల కోసమే గత కొంతకాలంగా వార్డులలో కొత్త శంకుస్థాపనలు వాయిదా వేస్తూ వచ్చారు.

ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు రాబోతుండటంతో.. రోడ్లు, డ్రైనేజీలు లాంటి సమస్యల పరిష్కారానికి, కొత్త పనులు చేపట్టడానికి శంకుస్థాపనలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే, వీరికి నిధుల కొర‌త వెంటాడుతోంది. అయినా కూడా త‌మ‌దే విజ‌య‌మ‌ని టీఆర్ ఎస్ వ‌ర్గాలు అంటుండ‌గా.. కాంగ్రెస్ నాయ‌కులు కూడా ఇదే త‌ర‌హా ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. మొత్తంగా చూస్తే.. ఎక్కువ‌గా ప్ర‌జ‌ల మొగ్గు టీఆర్ ఎస్‌వైపే ఉంటుంద‌ని అంటున్నారు విశ్లేష‌కులు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news