తిరుమల శ్రీ వారి ఆలయ మాజీ ప్రధానార్చకులు రమణ దీక్షితులు విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతో రమణ దీక్షితులుకు తిరిగి శ్రీ వారి ఆలయం లో అడుగు పెట్టేందుకు లైన్ క్లియరైంది. ముఖ్య మంత్రి ఆదేశాల మేరకు రమణ దీక్షితులును ఆగమ సలహాదారులుగా నియమిస్తూ టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుంది.
ఆలయ ఆగమ సలహాదారుడితో పాటు ఆలయ నూతన అర్చకులకు మార్గ నిర్దేశకుడిగా కూడా రమణ దీక్షితులు పనిచేయబోతున్నారు. గతంలో ఆలయ ప్రధాన అర్చకుడి గా ఉన్న రమణదీక్షితుల్ని చంద్రబాబునాయుడు ప్రభుత్వం అవమానకర రీతిలో వేటు వేసింది. ఆయన ఇద్దరు కుమారులను కూడా శ్రీ వారి ఆలయం నుంచి గోవిందరాజస్వామి ఆలయానికి బదిలీ చేసింది.
అప్పట్లో ప్రతి పక్ష నేతగా ఉన్న జగన్ మోహన్ రెడ్డి ని కలిసిన రమణ దీక్షితులు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తనకు చేసిన అన్యాయాన్ని వివరించారు. ఆ సమయంలో వైసీపీ అధికారం లోకి వస్తే తిరిగి శ్రీ వారి ఆలయం లో అడుగు పెట్టే అవకాశం కల్పిస్తామని జగన్ మోహన్ రెడ్డి రమణ దీక్షితులుకు హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకే ఇప్పుడు తిరిగి రమణదీక్షితుల్ని శ్రీ వారి ఆలయం లో అడుగు పెట్టేందుకు జగన్మోహనరెడ్డి ప్రభుత్వం లైన్ క్లియర్ చేసింది.
కొన్ని వ్యవహారా లు, కేసులు కోర్టుల్లో ఉన్న నేపథ్యంలో ఆ కేసులో క్లియర్ అయిన వెంటనే రమణ దీక్షితులుకు అర్చకత్వం బాధ్యతలు కూడా అప్పగిస్తారని చెబుతున్నారు. అదే సమయంలో గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రమణదీక్షితుల ఇద్దరు కుమారుల్ని బదిలీ చేయగా ఇప్పుడు తిరిగి ఆ ఇద్దరు కుమారులను శ్రీ వారి ఆలయ అర్చకు లుగా నియమించేందుకు టీటీడీ సిద్ధమైంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన ఉత్తర్వు లను కూడా టీటీడీ విడుదల చేయబోతున్నట్టు సమాచారం.