ఇప్పుడు దేశమంతా ఏపీ వైపు చూస్తోంది. అవును.. దేశమంతా ఎన్నికలు ఉన్నప్పటికీ ఏపీపైనే అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. ఏపీలో ఓవైపు అసెంబ్లీ ఎన్నికలు… మరోవైపు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ కూడా ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నది. ఎన్నికల కోసం సన్నాహాలు చేస్తోంది. అయితే.. ఈసారి ఏపీ ఎన్నికల్లో కొత్త విధానాన్ని ప్రారంభించనున్నట్లు ఎన్నికల కమిషన్ పేర్కొన్నది.
సాధారణంగా ఓటు వేసేటప్పుడు పోలింగ్ బూత్ ముందు క్యూలో నిలబడాలి. ఒక్కోసారి చాలామంది ఉంటే గంటలు గంటలు నిలబడాల్సి ఉంటుంది. అయితే.. ఈసారి ఏపీలో అటువంటి సమస్య లేకుండా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంటోంది. ఎన్నికల్లో టోకెన్ సిస్టమ్ ను ఏర్పాటు చేయనుంది. ప్రతి ఓటరుకు ముందే టోకెన్ అందజేస్తారు. వాళ్ల టోకెన్ నెంబర్ వచ్చినప్పుడు మాత్రమే ఓటేసే అవకాశం ఉంటుంది. దీంతో పోలింగ్ బూత్ ముందు గంటలు గంటలు నిలబడాల్సిన అవసరం ఉండదని ఎలక్షన్ కమిషన్ ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది వెల్లడించారు. దీని వల్ల ఓటింగ్ శాతం కూడా పెరుగుతుందని ద్వివేది అభిప్రాయపడ్డారు. ఇదివరకు మధ్యప్రదేశ్ ఎన్నికల్లోనూ ఇలా టోకెన్ విధానాన్ని ప్రవేశపెట్టారు.