ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడేనికి చెందిన నాగమణి, నాగరాజు, వెంకటేశ్వర్లు… బైక్ పై హైదరాబాద్ నుంచి వెళ్తున్నారు. నల్గొండ జిల్లా కేతేపల్లి మండలంలోని ఇనుపాముల వద్దకు వాళ్లు చేరుకోగానే.. వాళ్లు వెళ్తున్న బైక్ అదుపుతప్పి ముందు వెళ్తున్న ఓ వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో బైక్ పై ప్రయాణిస్తున్న వీళ్లు ముగ్గురు కింద పడ్డారు ఈ ఘటనలో నాగమణికి తీవ్ర గాయాలయ్యాయి.
వెంటనే అక్కడికి చేరుకున్న స్థానికులు… వాళ్లను పైకి లేపి పక్కన కూర్చోబెట్టారు. ఇంతలో హైదరాబాద్ నుంచి సూర్యాపేట వైపు కారులో వెళ్తున్న భువనగిరి ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ఈ ప్రమాదాన్ని గమనించి వెంటనే తన కారు ఆపారు. అక్కడికి వెళ్లి తీవ్రంగా గాయపడిన ఆ మహిళకు నర్సయ్య గౌడ్ ప్రథమ చికిత్స అందించారు. అంబులెన్స్ వచ్చేంతవరకు అక్కడే ఉండి.. అంబులెన్స్ లో ఎక్కించారు. ఎంపీ అయి ఉండి కూడా రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ మహిళకు చికిత్స అందించి.. ఆసుపత్రికి తరలించేంత వరకు సపర్యలు చేయడంతో అక్కడి స్థానికులంతా ఆయన్ను ప్రశంసించారు.