కమలం వలలో ‘బిగ్ ఫిష్’?

తెలంగాణలో ఎప్పటికప్పుడు బలపడుతూనే..అధికార టీఆర్ఎస్ పార్టీకి చెక్ పెట్టి అధికారం సాధించడమే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలురకాల వ్యూహాలతో టీఆర్ఎస్ ని ఇరుకున పెట్టే విధంగా బీజేపీ ముందుకెళుతుంది.. ఇదే క్రమంలో టీఆర్ఎస్ లో ఉండే బలమైన నేతలని లాగేయాలని బీజేపీ ఎప్పటినుంచో ప్రయత్నిస్తుంది. ఇప్పటికే చేరికల కమిటీ కన్వీనర్ గా ఉన్న ఈటల రాజేందర్.. ఈ నెలలో వలసలు ఎక్కువ ఉంటాయని చెప్పారు. అయితే నిదానంగా బీజేపీలోకి వలసలు ఊపందుకునేలా ఉన్నాయి. రానున్న రోజుల్లో బీజేపీలోకి పెద్ద తలకాయలు బాగానే వస్తారని తెలుస్తోంది.

ఇప్పటికే బడా నేతలకు బీజేపీ గాలం కూడా వేసినట్లు తెలుస్తోంది.. ఇప్పటికే పలువురు బడా నాయకులని బీజేపీలో చేర్చుకునే కార్యక్రమం మొదలుపెట్టారు. ఇదే క్రమంలో టీఆర్ఎస్ లో ఉన్న్ జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లాంటి నాయకులని బీజేపీలో చేర్చుకోవడానికి సిద్ధమయ్యారు. ఈ ఇద్దరు నేతలు టీఆర్ఎస్ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అందుకే వీరికి బీజేపీ గాలం వేస్తుంది.. ఇద్దరు నేతలు మంచి ఫాలోయింగ్ ఉన్న వారు.. కాబట్టి వీరిని బీజేపీలోకి లాగితే పార్టీకి కాస్త అడ్వాంటేజ్ ఉంటుంది.

ఇప్పటికే వీరితో బీజేపీ అధిష్టానం టచ్ లోకి వెళ్ళినట్లు సమాచారం..త్వరలోనే వీరిని బీజేపీలోకి తీసుకురావచ్చు. కాకపోతే బీజేపీలో ఉన్న డీకే అరుణతో జూపల్లికి పడదు. గతంలో వీరు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు..పెద్ద రచ్చ నడిచింది.. తర్వాత జూపల్లి.. టీఆర్ఎస్ లో చేరిపోయారు.

ఇటు అరుణ బీజేపీలోకి వచ్చేశారు..ఇక ఇప్పుడు జూపల్లి కూడా బీజేపీలోకి వస్తే పరిస్తితి ఎలా ఉంటుందో తెలియదు.. అరుణ ఉన్న పార్టీలోకి జూపల్లి రావడానికి చూస్తారా? అనేది డౌట్. కాకపోతే మారుతున్న రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు. ఆలంపూర్ మాజీ ఎమ్మెల్యే చల్లా వెంకటరామిరెడ్డిని సైతం బీజేపీలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. చల్లా వస్తే పాలమూరులో బీజేపీకి ప్లస్  అవుతుంది. వీరే కాకుండా ఇంకా బిగ్ ఫిష్ లాంటి నేతలు కమలం వలలో చిక్కేలా ఉన్నారు.