ట్రెండ్ ఇన్ : వైఎస్ ష‌ర్మిల

మిర్చి రైతుల స‌మ‌స్య‌ల‌పై రాజకీయ పార్టీలు గ‌ళ‌మెత్తి ప్ర‌భుత్వాల‌ను క‌ద‌లించాల్సిన ఆవ‌శ్య‌క‌త ఎంతైనా ఉంది. ఏపీలో ప‌ద‌హారు వేల‌కు పైగా క్వింటా ధ‌ర ప‌లుకుతుంటే, తెలంగాణ‌లో మాత్రం క్వింటా ధ‌ర ప‌ద్నాలుగు వేలు క‌న్నా త‌క్కువ ప‌లుకుతోంది. మొన్న‌టి వ‌ర‌కూ క్వింటా ధ‌ర ప‌దిహేడు వేలకు పైగా ఉండ‌గా ద‌ళారీల దందా కార‌ణంగా ఎనుమాముల మార్కెట్ లో పంట ధ‌ర ఒక్క‌సారి ప‌డిపోయి రైతును క‌న్నీరెట్టిస్తోంది. ఈ ద‌శ‌లో వారిని త‌క్ష‌ణ‌మే ఆదుకోవాల‌ని వైఎస్సార్టీపీ ప‌ట్టుబడుతోంది. ఆ వివ‌రం.. ఈ క‌థ‌నంలో..

కేసీఆర్ ను ల‌క్ష్యంగా చేసుకుని వైఎస్సార్టీపీ ష‌ర్మిల మ‌రో ఉద్య‌మం చేప‌ట్టేందుకు సిద్ధం అవుతున్నారు. నిరుద్యోగ యువత తో పాటు రైతుల స‌మ‌స్య‌ల‌పై కూడా మాట్లాడేందుకు స‌న్న‌ద్ధం అవుతున్నారు. ప్ర‌త్యేక రాష్ట్రంలో పంట‌ల‌కు గిట్టుబాటు రాక రైతు ఆత్మ‌హ‌త్య‌లు పెరిగిన త‌రుణాన అన్ని రాజ‌కీయ పార్టీల మాదిరిగా కాకుండా త‌న‌దైన పంథాలో ఉద్య‌మ కార్యాచ‌ర‌ణ‌కు సిద్ధం అవుతూ, త‌క్ష‌ణ‌మే బాధిత రైతుల‌కు న్యాయం చేయాల‌ని ప‌ట్టుబ‌డుతున్నారు.

తెలంగాణ రాజ‌కీయ వాతావ‌ర‌ణంలో మిర్చి పొగ‌లు సెగ‌లు చుట్టు ముట్ట‌నున్నాయి. వ‌రంగ‌ల్ కేంద్రంగా న‌డుస్తున్న ఉద్య‌మ సెగ‌లు కేసీఆర్ ను తాక‌నున్నాయి. ముఖ్యంగా నిన్న‌టి వేళ నాలుగు గంట‌ల‌కు పైగా న‌డిచిన ఉద్రిక్త‌త కార‌ణంగా పొలిటీషియ‌న్లు ఈ విష‌య‌మై ఒక్కొక్క‌రుగా స్పందిస్తున్నారు. త‌మ‌కు న్యాయం ద‌క్కేలా ప్ర‌తి ఒక్కరూ అండ‌గా నిల‌వాల‌ని వీరంతా కోరుతున్నారు.

ఇంటికో ఉద్యోగం అంటూ ఆ రోజు తెలంగాణ ఉద్య‌మం న‌డిపిన కేసీఆర్ త‌రువాత ఆ విష‌యం మ‌రిచిపోయారు అని వైస్సార్టీపీ అధినేత్రి ష‌ర్మిల వ్యాఖ్యానించారు. ఇదే సంద‌ర్భంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ పై వైఎస్ ష‌ర్మిల ఫైర్ అయ్యారు. నిన్న‌టి వేళ ఎన‌మాముల మార్కెట్ యార్డు వివాదం నేప‌థ్యంలో ఆమె స్పందించారు.

వ‌రంగ‌ల్ జిల్లా, ఎన‌మాముల మార్కెట్ యార్డులో జ‌రిగిన వివాదం మిర్చిరైతుల‌కు గిట్టుబాటు ద‌క్క‌ని వైనంపై ఆమె ఫైర్ అయ్యారు. మిర్చి రైతుల‌ను వెంట‌నే ఆదుకోవాల‌ని ప‌ట్టుబ‌ట్టారు.అదేవిధంగా మిర్చి కొనుగోళ్ల‌లో రైతులు ద‌ళారీల బారిన ప‌డ‌కుండా కూడా త‌గు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు.