టిఆర్ఎస్ అభ్యర్ధి ముక్కు కొరికిన కాంగ్రెస్ అభ్యర్ధి…!

787

తెలంగాణలో రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పలు చోట్ల మినహా దాదాపు అన్ని చోట్లా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కొన్ని ప్రాంతాల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు కొట్టుకోవడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. నిజామాబాద్ జిల్లా బోధన్ మున్సిపాలిటీ పరిధిలోని 32వ వార్డులో టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది.

ఈ ఘర్షణలో టీఆర్ఎస్ అభ్యర్థి ఇమ్రాన్ ముక్కును, వేళ్లను కాంగ్రెస్ అభ్యర్థి ఇలియాజ్ కోరకడంతో ఒక్కసారిగా ఘర్షణ పెరిగింది. దీనిపై స్పందించిన ఇమ్రాన్, కాంగ్రెస్ అభ్యర్థి రిగ్గింగ్‌కు పాల్పడుతుండడంతో అడ్డుకున్నానని ఐతే అక్కడే ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు తనపై దాడి చేశారని ఆవేదన వ్యక్త చేసారు. కాంగ్రెస్ అభ్యర్థి ఇలియాజ్ కూడా దాడిచేసి ముక్కు, వేళ్లు కొరికాడని ఆరోపించాడు.

దీనితో రక్తస్రావం కావడంతో అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై ఎన్నికల అధికారులు దర్యాప్తుచేస్తున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే ఈ ఎన్నికల్లో పలు చోట్ల తీవ్ర ఉద్రిక్త చెలరేగినా పోలీసులు అప్రమత్తంగా ఉండి అదుపు చేసారు. హైదరాబాద్ లో కొన్ని ప్రాంతాల్లో అత్యల్పంగా ఓటింగ్ నమోదు అయింది. వరంగల్ జిల్లాలో మాత్రం భారీ ఓటింగ్ నమోదు అయింది.