ఎమ్మెల్సీ టార్గెట్ గా ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు ఒక్కటయ్యారా

-

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా టీఆర్‌ఎస్‌లో అనూహ్య మార్పులు జరుగుతున్నాయి. ఇన్నాళ్లూ ఎడముఖం పెడముఖంగా ఉన్న పొరుగు నియోజకవర్గాలకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఒక్కటి కావడంతో రాజకీయం హీటెక్కింది. నిన్నమొన్నటి దాకా ఒకరితో ఒకరికి సంబంధం లేని ముగ్గురు ఎమ్మెల్యేలు ఇప్పుడు ఉన్నట్టుండి ఒక దగ్గర ప్రత్యక్షమైయ్యారు. ఆ ముగ్గురిని ఒక్కతాటి మీదకు తెచ్చింది మాత్రం ఆ ఎమ్మెల్సీ తో వైరమే నట..

వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ కుమార్, పరిగి ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరన్న నానుడి ఈ ముగ్గురు ఎమ్మెల్యేల వ్యవహార శైలి తెలియజేస్తుంది. ఒకరు మాజీ మంత్రి మనిషి అని, ఒకరు ప్రస్తుత మంత్రి మనిషి అని… మరొకరు ఇద్దరితో మనవాడే అనిపించుకునే వారనే నిన్న మొన్నటి వరకు భావించేవారు. ఈ ముగ్గురు మొదటిసారిగా శాసనసభ్యులుగా గెలిచిన వాళ్లే. గెలిచిన కొత్తలో కలిసి మెలిసి ఉన్నా.. ఆ తరువాత జిల్లాలో గ్రూపులు ఏర్పడ్డాయి. ఎమ్మెల్యేల మధ్య గ్యాప్ వచ్చింది.

మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి పదేపదే తమ నియోజకవర్గాల్లో పర్యటిస్తూ కనీస సమాచారం ఇవ్వకపోవడంతో ఇప్పుడి ముగ్గురు ఎమ్మెల్యేలను ఇదే సమస్య ఏకం చేసిందట..అయితే ఇటీవల జిల్లాలో జరుగుతున్న రాజకీయాలు అధిష్ఠానం దృష్టికి వెళ్లాయి. వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ సునీత మహేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఆయన సోదరుడు కొడంగల్ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిలు జిల్లాలో పట్టుకోల్పోకుండా చూసుకుంటున్నారట. అందులో భాగంగానే జిల్లాలో తనదైన శైలిలో పావులు కదుపుతున్నారట మాజీ మంత్రి.

దీంతో అప్రమత్తమైన ముగ్గురు ఎమ్మెల్యేలు హైదరాబాద్ బాట పట్టారు. పార్టీని పక్కన పెట్టి సొంతంగా ఎదిగే ప్రయత్నాలు చేస్తున్నట్టు..ఇతర పార్టీ నేతలతో మంతనాలు జరుపుతున్నట్టు కొందరు టీఆర్‌ఎస్‌ పెద్దల దృష్టికి తీసుకెళ్లారట. అయితే పార్టీ బలోపేతం కోసమే కృషి చేస్తున్నామని.. తమకు ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని చెప్పేందుకు ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీ పెద్దలకు వివరణ ఇచ్చారట. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే కవితలను ముగ్గురు ఎమ్మెల్యేలు కలిసి ఇటీవల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. పైకి విషెస్ చెప్పినట్లుగా ఉన్నా.. జిల్లా తాజా రాజకీయాలపై చర్చించడంతోపాటు తమ సమస్యలను ఏకరువు పెట్టినట్లు తెలిసింది.

తమ నియోజకవర్గాల్లో ఇతరుల జోక్యం లేకుండా చూడాలని కోరినట్టు సమాచారం. బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్.. ఇతర నాయకుల సహాయ సహకారాలపై కేటీఆర్‌కు వివరించినట్టు జిల్లా టీఆర్ఎస్‌లో చర్చ జరుగుతోంది. అలాగే తమ బలాన్ని చాటుకునేలా పార్టీలో పెద్ద ఎత్తున చేరికలు ప్రోత్సహిస్తారని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news