గత కొంత కాలంగా తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలపై సంకేతాలు ఇస్తున్న విషయం విదితమే. ఆ మేరకు టీఆర్ఎస్ నాయకులకు గులాబీ బాస్ ముందుగా ఆదేశాలను జారీ చేస్తూనే ఉన్నారు. నియోజకవర్గాల్లో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేసుకోవాలని, ముందస్తు ఎన్నికలకు సిద్ధం కావాలని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని గతంలోనే నేతలకు కేసీఆర్ చెప్పారు. అయితే తాజాగా కేసీఆర్ చేసిన మరో ప్రకటనతో ముందస్తు ఎన్నికలు కచ్చితంగా వస్తాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తెలంగాణ భవన్‌లో రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని ఇవాళ నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. సమావేశంలో భాగంగా 9 ఏకగ్రీవ తీర్మానాలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొన్ని పత్రికలు తమ పార్టీపై దుష్ర్ర్పచారం చేస్తున్నాయని, అది మానుకోవాలని సూచించారు. అలాగే తాను 40 మంది ప్రజా ప్రతినిధులను మారుస్తానని కొన్ని మీడియా సంస్థలు చెప్పాయని, కానీ అందులో నిజం లేదని స్పష్టం చేశారు. ఇక రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ ఒంటరిగానే పోటీ చేస్తుందని తెలిపారు.
వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఎవరితోనూ పొత్తుకు వెళ్లదని, ఒంటరిగానే పోటీ చేస్తుందని కేసీఆర్ అన్నారు. ఇందుకు గాను పార్టీ కార్యవర్గం అంతా కలిసి ఏకగ్రీవంగా నిర్ణయం కూడా తీసుకుందని తెలిపారు. ఇక హైదరాబాద్ ఓఆర్ఆర్ పరిధిలో సెప్టెంబర్ 2వ తేదీన ప్రగతి నివేదన పేరిట భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తానన్నారు. తాము నాలుగేళ్లలో సాధించిన అభివృద్ధి పనులను ప్రజలకు తెలియజేస్తానని తెలిపారు. ఇక రాబోయే ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ తరఫున బరిలో నిలిచే అభ్యర్థులను కూడా వచ్చే నెలలోనే ప్రకటిస్తానని తెలిపారు.
రాబోయే ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ 100కు పైగా స్థానాలను గెలుచుకుంటుందన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం లేదని, తాము అనేక సర్వేలు చేయించామని, వాటిల్లో తమ పార్టీకే ప్రజలు అనుకూలంగా ఉన్నట్లు ఫలితం వచ్చిందన్నారు. అయితే జూన్ వరకు తెలంగాణ అసెంబ్లీకి గడువు ఉన్న నేపథ్యంలో ఏప్రిల్ లేదా మే నెలలో ఎన్నికలు జరగాల్సి ఉంటుంది. ఇక అందుకు ఒక నెల ముందుగా.. అంటే మార్చిలో అభ్యర్థులను ఖరారు చేయాలి. కానీ అంతకు దాదాపుగా 6 నెలల ముందే సీఎం కేసీఆర్ తమ పార్టీ అభ్యర్థులను ఖరారు చేస్తామని కరాఖండిగా చెప్పేశారు. అంటే.. దీన్నిబట్టి మనకు తెలుస్తుందేమిటంటే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే వేసవిలో కాక, రానున్న డిసెంబర్ నెలలోనే వస్తాయని అర్థమవుతోంది. మరి ఎన్నికలు డిసెంబర్‌లోనే జరుగుతాయా.. అంటే అందుకు కాలమే సమాధానం చెప్పాలి..!