తెలంగాణలో మరికొన్ని రోజులు లాక్‌డౌన్ పొడగింపు..?

తెలంగాణ‌ ప్ర‌భుత్వం విధించిన లాక్‌డౌన్ మే 30న ముగియ‌నుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మరోమారు లాక్‌డౌన్ పొడిగిస్తారా? లేదా అన్న అంశంపై ప్ర‌జ‌ల్లో ఉత్కంఠ నెల‌కొన్న‌ది. అయితే తెలంగాణలో మరికొన్ని రోజులు లాక్‌డౌన్ పొడగించే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం తెలంగాణలో కరోనా పరిస్థితులు అదుపులోనే ఉన్నప్పటికీ మరికొన్ని రోజులు లాక్‌డౌన్ పొడగిస్తేనే మంచిదని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై రేపు (ఆదివారం) జరిగే తెలంగాణ కేబినెట్ భేటీలో తుది నిర్ణయం తీసుకోనున్నారు.

ఆదివారం మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు ప్రగతి భవన్ లో ముఖ్య‌మంత్రి కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ సమావేశంలో లాక్‌డౌన్ సహా ప్రస్తుతం రాష్ట్రంలో వ్యవసాయం పరిస్థితి, కొనసాగుతున్న ధాన్యం సేకరణ, విత్తనాలు, ఎరువుల లభ్యత, కల్తీ విత్తనాల నిరోధానికి చర్యలు తదితర అంశాలపై చర్చించనున్నారు. ఈ భేటీలో మంత్రుల‌తో పాటు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్, ఇత‌ర అధికారులు కూడా పాల్గొననున్నారు.

శనివారం వ్యవసాయశాఖపై సీఎం కేసీఆర్‌ ప్రగతి భవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో రానున్న వానాకాలంలో రాష్ట్రంలో పంటల సాగు, విత్తనాలు, ఎరువుల లభ్యత తదితర అంశాలపై సీఎం కేసీఆర్‌ అధికారులతో చర్చించినట్లు తెల్సింది. ఈ సమావేశంలో చర్చించిన అంశాలపై రేపు జరిగే కేబినెట్ భేటీలో తుది నిర్ణయాలు తీసుకోనున్నారు. అలానే వానాకాలం రైతుబంధుకు సంబంధించి కూడా రేపు మంత్రివర్గం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.