ఎక్కడో బీహార్ లోనో లేదా మరో చోటనో చట్ట సభల్లో తగాదాలు ప్రతిరోజూ వార్తల్లో చూస్తుంటాం. కానీ కడప జిల్లా ప్రొద్దుటూరులో పాలక మండలి సభ్యులు స్థాయిని మరిచి చెప్పులతో దాడి చేసుకున్న ఘటన తీవ్ర విచారానికి దారి తీస్తోంది. ముఖ్యమంత్రి జిల్లాలోనే కొట్లాటలు ఈ స్థాయిలో ఉంటే ఇక మిగిలిన పాలక మండళ్లు ఏ విధంగా ఉంటాయో అర్థం చేసుకోవచ్చన్న వాదన ఒకటి స్పష్టంగా అందరి నోటా వినిపిస్తోంది.
వేసవి సమీపిస్తున్న తరుణంలో తాగునీటి ఎద్దడిని పరిష్కరించాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారు. ఎప్పటి నుంచో అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై ఫోకస్ లేదు. అదేవిధంగా మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ పాలనపై పట్టు లేదు. ఆకస్మిక తనిఖీలు లేవు. ఓ విధంగా చెప్పాలంటే రివ్యూ మీటింగ్ లు లేవు. వీడియో కాన్ఫరెన్స్ లు లేవు. ఇవన్నీ ఉంటే కొంతలో కొంత అధికార యంత్రాంగం పరిపూర్ణంగా కాకపోయినా కాస్తో కూస్తో శ్రద్ధవహించి పనులు చేసేది.
సీఎం ఇలాకాలో నిన్నటి వేళ అనుచిత ప్రవర్తనలు చోటు చేసుకున్నాయి. ప్రొద్దుటూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం సందర్భంగా రసాభాస వాతావరణం నెలకొంది. ముఖ్యంగా అధికార పార్టీ సభ్యులే ఒకరినొకరు తిట్టుకుంటూ కొట్టుకుంటూ కౌన్సిల్ హాల్ నుంచి బయటకు రావడంతో ఇక్కడ తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. దీంతో ఇరు వర్గాల కొట్లాటను ఆపేందుకు ప్రయత్నించిన పోలీసులకు దెబ్బలు తగిలాయి. 13 వ వార్డులో తాగునీటి సమస్యను పరిష్కరించాలని ఎన్ని సార్లు మొత్తుకున్నా ఫలితం లేదని కౌన్సిలర్ ఇర్ఫాన్ ఖాన్ పదే పదే ప్రస్తావించారు. ఇదే విషయమై వైస్ చైర్మన్ ఖాదర్ మొహియుద్దీన్ స్పందింస్తూ అధికార పక్షం నేత అయి ఉండి సమస్యను పదే పదే లేవనెత్తుతావా అని కోపంతో ఊగిపోయారు. దీంతో ఇరు వర్గాలు దాడి చేసుకున్నాయి. చెప్పులతో కొట్టుకున్నాయి. తరువాత సమావేశం ముగించి వెళ్తున్న ఇర్ఫాన్ పై ఖాదర్ మొహియుద్దీన్ వర్గాలు దాడి చేశారు.
ప్రొద్దుటూరులో గూండాయిజంను సీఎం నియంత్రించగలరా?@YSRCParty @JaiTDP #AndhraPradesh
— Manalokam (@manalokamsocial) April 1, 2022