టీ కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయాలు అనేవి మొదటి నుంచి చాలా కామన్‌గానే వస్తున్నాయి. ఇక రీసెంట్‌గా అవ్వి రేవంత్ ను ప్రెసిడెంట్‌ను చేసే విషయంలో ఏ మేరుకు ప్రభావితం చూపాయో అందరికీ తెలిసిందే. ఏకంగా రేవంత్‌ను చేయొద్దంటూ సోనియా గాంధీకి కూడా లేఖలు రాశారు కాంగ్రెస్ నేతలు. అందులో మరీ ముఖ్యంగా వీ హనుమంతరావు గురించే చెప్పుకోవాలి. ఎందుకంటే మొదటి నుంచి ఆయన రేవంత్‌పై తీవ్ర వ్యతిరేకతతోనే ఉన్నారు.
ఇక రేవంత్ రెడ్డి తాను టీపీసీసీ చీఫ్ గా ఎన్నికైన తర్వాత తనను వ్యతిరేకించిన వారి మద్దతు కోసం ఏకంగా వారి ఇండ్లకు వెళ్లి బుజ్జగించే ప్రయత్నం కూడా చేశారు. అలాగే వీ హనుమంతరావు విషయంలో కూడా వివాదాలను పక్కన పెట్టి రేవంత్ రెడ్డి ఆయన్ను ఆస్పత్రికి వెళ్లి మరీ పరామర్శించి తనకు అండగా ఉండాలని కోరారు. అయితే ఇప్పుడు వీహెచ్ వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో పెద్ద దుమారమే రేపుతున్నట్టు తెలుస్తోంది.
ఎందుకంటే ఇంకా కూడా ఆయన అలక వీడినట్టు కనిపించట్లేదు. ఇప్పుడు ఆస్పత్రి నుంచి ఇంటికి వచ్చిన వీహెచ్ మీడియాతో మాట్లాడుతూ కొత్త ప్రెసిడెంట్, కొత్త కమిటీల గురించి తాను ఇప్పుడు ఏం మాట్లాడబోనని, అది తనకు ఇష్టం లేదని చెప్పారు. తాను ఢిల్లీ వెళ్లి సోనియా గాంధీతో చర్చించిన తర్వాతే మిగతా విషయాలు మాట్లాడుతానని చెప్పడంతో ఆయన ఇంకా అసంతృప్తిలోనే ఉన్నట్టు తెలుస్తోంది. ఒక్కొక్కరుగా అందరూ కలిసి వస్తున్న సమయంలో ఇంకా కూడా వీహెచ్ అలక వీడకపోవడం కాంగ్రెస్‌లో కలవరం రేపుతున్నాయి.