వైసీపీలో జగన్ తర్వాత కీలకంగా వ్యవహరిస్తూ..పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేస్తున్న నేతల్లో సజ్జల రామకృష్ణారెడ్డి ముందు వరుసలో ఉంటారని చెప్పవచ్చు. ఈయన వైసీపీలో నెంబర్ 2 అని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి జగన్‌కు అన్నీ రకాలుగా అండగా ఉంటూ ఓ వైపు పార్టీ బలం తగ్గకుండా, మరోవైపు ప్రత్యర్ధులని నిలువరిస్తూ రావడంలో సజ్జల సక్సెస్ అవుతున్నారు.
ఇక వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధుల ఎంపిక విషయంలో కూడా సజ్జల కీలక పాత్ర పోషించే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ సలహాదారుడుగానే కాకుండా..పార్టీ కోసం ఆయన నిత్యం కష్టపడుతూనే ఉన్నారు. ఇక తాజాగా ఆయన విజయవాడలో పలు అభివృద్ధి కార్యక్రమాలని ప్రారంభించారు. ఈ క్రమంలో విజయవాడలో పోటీ చేసే వైసీపీ అభ్యర్ధులని ఫిక్స్ చేశారు. విజయవాడ తూర్పు నుంచి దేవినేని అవినాష్, సెంట్రల్ నుంచి మల్లాది విష్ణు, వెస్ట్ నుంచి వెల్లంపల్లి శ్రీనివాసరావు పోటీ చేస్తారని సజ్జల ప్రకటించారు.
మరి ఈ ముగ్గురులో గెలుపు అవకాశాలు ఎవరికి ఉన్నాయి. సర్వేలు ఏం చెబుతున్నాయనే అంశం పరిశీలిస్తే..ఈ ముగ్గురుకు గెలుపు అవకాశాలు బాగానే ఉన్నాయి. కాకపోతే సెంట్రల్ లో టిడిపితో కాస్త గట్టి పోటీ తప్పదు. అదే సమయంలో టిడిపి-జనసేన పొత్తు ఉంటే..తూర్పు, పశ్చిమలో కూడా టఫ్ ఫైట్ తప్పదు.
అయితే ఇక్కడ పొత్తు ఉన్న వైసీపీ గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. టిడిపి-జనసేన పొత్తు దాదాపు ఖాయమే. పొత్తులో తూర్పు, సెంట్రల్ సీట్లు టిడిపికి, వెస్ట్ జనసేనకు దక్కే ఛాన్స్ ఉంది. ఇక టిడిపి పోటీ చేసిన చోట జనసేన ఓట్లు పూర్తిగా బదిలీ కాకపోయినా, జనసేన పోటీ చేసిన చోట టిడిపి ఓట్లు బదిలీకాకపోయిన వైసీపీకే మేలు.