మహారాష్ట్ర బరిలో బీఆర్ఎస్.. ప్రభావం ఉంటుందా?

-

టీఆర్ఎస్ పార్టీని కాస్త బీఆర్ఎస్‌గా మార్చిన కేసీఆర్..ఇకపై జాతీయ రాజకీయాలపై ఎక్కువ దృష్టి పెట్టడానికి రెడీ అవుతున్నారు. తమకు అనుకూలంగా ఉన్న రాష్ట్రాల్లో బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసే దిశగా కేసీఆర్ పనిచేయడానికి రెడీ అవుతున్నారు. ముఖ్యంగా పక్కనే ఉన్న ఏపీతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలపై కేసీఆర్ ఎక్కువ ఫోకస్ చేయనున్నారని..గత కొన్ని రోజులుగా కథనాలు వస్తున్న విషయం తెలిసిందే.

అయితే ఈ మూడు రాష్ట్రాల్లో చేరికలు ఎక్కువ వచ్చేలా చేసుకుని..ఈ రాష్ట్రాల్లో జరిగే పార్లమెంట్ ఎన్నికల బరిలో పోటీ చేయాలని కేసీఆర్ చూస్తున్నారు. ఇక 2023 చివరిలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో మాత్రం తమ మిత్రపక్షమైన జేడీఎస్ పార్టీకి మద్ధతు ఇస్తారని తెలుస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం తెలుగు ప్రజలు ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో పోటీ చేస్తారని మాజీ సీఎం కుమారస్వామి ఆల్రెడీ క్లారిటీ ఇచ్చారు.

ఇదిలా ఉంటే మహారాష్ట్రపై కూడా కేసీఆర్ ఎక్కువగానే ఫోకస్ చేశారు. అది కూడా తెలుగు ప్రజలు ఎక్కువ ఉన్న ప్రాంతాలపై. గడ్చిరోలీ, నాందేడ్, పర్చానీ జిల్లాలపై స్పెషల్‌గా దృష్టి పెట్టారు. అయితే రెండు నెలల్లో మహారాష్ట్రలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈలోపు బీఆర్ఎస్‌కు ఎన్నికల సంఘం క్లియరెన్స్ ఇస్తే..స్థానిక ఎన్నికల్లో పోటీ చేస్తారని తెలుస్తోంది.

ఇప్పటికే నాందేడ్ జిల్లాలోని గంజ్ గావ్, కార్ల గ్రామాలతో పాటు, కిన్వాట్, మహోర్ తాలూకా గ్రామాల ప్రజలు తమని..తెలంగాణలో కలపాలని..అక్కడ స్థానిక కలెక్టర్‌కు గతంలో వినతి పత్రాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇటు తెలంగాణ పథకాలు కావాలని..తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా కోరారు. అయితే ఇటీవల బీఆర్ఎస్ ఏర్పాటు నేపథ్యంలో ఆయా గ్రామ ప్రజలు సంబరాలు చేసుకున్నారు.

ఇలా అనుకూలంగా ఉన్న గ్రామాలని దృష్టిలో పెట్టుకుని మహారాష్ట్ర స్థానిక ఎన్నికల బరిలో దిగాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మరి బరిలో దిగడం కుదురుతుందా? ఒకవేళ బరిలో దిగితే బీఆర్ఎస్ ప్రభావం చూపగలదో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news