పీవీ కూతురుతో కేసీఆర్ ఫ్యూహం ఫలిస్తుందా

-

నిన్నటి వరకు అక్కడ టీఆర్ఎస్ పోటీలో ఉండదనుకున్నారు. వేరే పార్టీ అభ్యర్థికి మద్దతిస్తారని ప్రచారం జరిగింది. అలాంటిది చడీ చప్పుడు లేకుండా కొత్త వ్యూహానికి పదును పెట్టారు సీఎం కేసీఆర్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాజీ ప్రధాని పీవీ కుమార్తెను బరిలో దించి అన్ని పార్టీలకు సడన్ షాకిచ్చింది అధికార పార్టీ. ఈ సరికొత్త కేసీఆర్ ఎత్తుగడపై అధికార పార్టీలో ఆసక్తికర చర్చ జరుగుతుంది.

సురభి వాణి. నిన్న మొన్నటి వరకు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె. విద్యావేత్త. ఇప్పుడు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి. హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీగా బరిలో దిగారు. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ స్థానంలో టీఆర్‌ఎస్‌ బలపరిచిన ఉద్యోగ సంఘాల నేత దేవీప్రసాద్‌ ఓడిపోయారు. దానికితోడు జీహెచ్‌ఎంసీ, దుబ్బాక ఎన్నికల్లో వచ్చిన ఫలితాల తర్వాత ఇక్కడ టీఆర్‌ఎస్‌ పోటీ చేయకపోవచ్చని అనుకున్నారు. దానికి తగట్టుగానే పోటీపై సైలెంట్ అయింది గులాబీ దళం. లెఫ్ట్‌ పార్టీల అభ్యర్థి ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌కు పరోక్షంగా మద్దతిస్తారని భావించారు. కానీ.. సీఎం కేసీఆర్‌ వేసిన ఎత్తుగడ అన్ని పక్షాల్లోనూ చర్చకు దారితీసింది.

పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలను ఏడాదిపాటు అట్టహాసంగా నిర్వహించాలన్నది టీఆర్‌ఎస్‌ ప్లాన్‌. ఆరంభ కార్యక్రమం అదే విధంగా సాగింది. పీవీ కుటుంబ సభ్యులను కూడా ఆహ్వానించారు. పీవీకి భారతరత్న ఇవ్వాలని కేంద్రానికి సిఫారసు చేసింది టీఆర్‌ఎస్‌ సర్కార్‌. ఆ సమయంలోనే గవర్నర్‌ కోటాలో సురభి వాణిని శాసనమండలికి పంపుతారని అనుకున్నారు. అలాంటిది ఇప్పుడు ఆమెను ఎన్నికల బరిలో దించడం వెనక బలమైన వ్యూహం ఉందని అనుకుంటున్నారట.

ఈ నియోజకవర్గంలో ప్రస్తుతం బీజేపీ నేత రామచంద్రరావు ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆ స్థానాన్ని నిలబెట్టుకోవాలన్నది కమలనాథుల వ్యూహం. దానిని బ్రేక్‌ చేయాలని గులాబీ నేతలు చూస్తున్నారు. ఇదే నియోజకవర్గంలో సత్తా చాటి పార్టీకి కొత్త ఊపిరులు ఊదాలని చూస్తోంది కాంగ్రెస్‌. మాజీ మంత్రి చిన్నారెడ్డిని బరిలో దించింది. మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ సైతం పోటీలో ఉన్నారు. ఈ హేమాహేమీ నాయకుల మధ్య టీఆర్‌ఎస్‌ గెలుపు వ్యూహం పక్కాగా ఉందన్నది టీఆర్‌ఎస్‌ నేతలు చెప్పేమాట.

పీవీ నరసింహారావు కాంగ్రెస్‌ నేత. ఆ పార్టీ నుంచే ప్రధానమంత్రిగా చేశారు. ఆయన జీవిత చరమాంకంలో కాంగ్రెస్‌ ఆయనతో అంటీముట్టనట్టు ఉంది. పైకి చెప్పుకోకపోయినా కాంగ్రెస్‌ నేతల్లో చాలా మందిలో ఆ మేరకు సానుభూతి ఉందన్నది టీఆర్‌ఎస్‌ లెక్క. అందుకే సురభి వాణికి కాంగ్రెస్‌ సానుభూతి పరుల ఓట్లు పడతాయని అభిప్రాయపడుతోంది. రెండోది సామాజికవర్గం. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రామచంద్రరావు, సురభివాణి ఇద్దరూ బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందినవారు. ఒకవేళ సురభి వాణి బరిలో లేకపోతే ఆ సామాజికవర్గం ఓట్లు బీజేపీకే పడతాయని.. ఇప్పుడు టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని ప్రకటించడంతో ఓట్ల చీలిక వస్తుందని లెక్కలు వేస్తున్నారు.

ఈ విషయంలో ఎవరి లెక్కలు వాళ్లకే ఉన్నా. కేసీఆర్ వ్యూహాం మాత్రం ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు రాజకీయ వర్గాల్లోనూ, ప్రజల్లోనూ ఆసక్తి రేపుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news