దివంగత మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా దిగిపోయే టైంలో ఆయనకు ఎన్ని అవమానాలు జరిగాయో… టీడీపీ వాళ్లు ఆయన్ను ఎంతలా అవమానించారో ? ప‌్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నాడు ఎన్టీఆర్‌కు జరిగిన అవమానం అప్పటి సమైక్య రాష్ట్ర తెలుగు ప్రజలే కాకుండా దేశం అంతా చూసింది. ఇప్పుడు నాటి పరిణామాలపై మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కీలక వ్యాఖ్యలు చేశారు.
అసెంబ్లీ లాబీలో మీడియాతో యనమల చిట్‌చాట్ చేసిన ఆయన ఎన్టీఆర్ సీఎంగా దిగిపోయినప్పుడు లోపల జరిగిన పరిణామాలు వేరు.. బయట చేసిన విమర్శలు వేరు అని చెప్పారు. ఇక ఆ టైంలోనే తాను అసెంబ్లీ స్పీకర్‌గా ఉన్నానని.. అప్పుడు ఎన్టీఆర్ బీఏసీ సమావేశానికి తనను ఎందుకు పిలవలేదనే అంశంపై సభలో మాట్లాడుతానని తనను కోరారని.. అయితే అప్పటికే టీడీపీ ఎమ్మెల్యేలు అందరూ పార్టీ శాసనసభా పక్ష నేతగా చంద్రబాబును ఎన్నుకున్నారని, నిబంధనల ప్రకారం ఫ్లోర్ లీడర్లను మాత్రమే బీఏసీకి పిలుస్తారని యనమల పేర్కొన్నారు.
అప్పుడు ఎన్టీఆర్ తనను కోరినా తాను నిబంధనల ప్రకారం ఆయనకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని చెప్పారు. అయితే ఎన్టీఆర్ మాత్రం తాను ఆ ఆంశం తప్ప వేరే అంశం గురించి మాట్లాడనని.. సభ నుంచి వెళ్లిపోయారని గుర్తుచేశారు. ఏదేమైనా అప్పట్లో యనమల ఎన్టీఆర్‌కు చేసిన అవమానంపై చాలా విమర్శలే వచ్చాయి. అందుకే ఆయనకు చంద్రబాబు కీలకమైన ఆర్థికశాఖ ఇచ్చారని చాలా మంది చెప్పుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు యనమల మాత్రం రూల్స్, కాకరకాయ్ అంటూ కవరింగ్‌లు చేస్తున్నారు.