విశాఖలోఎమ్మెల్యేలకు వైసీపీ శ్రేణులే షాకిచ్చాయా ?

-

పంచాయతీ ఎన్నికల్లో విశాఖ వైసీపీ ఎమ్మెల్యేలకు విచిత్ర పరిస్థితి ఎదురైంది. ఎమ్మెల్యేలు ఒక అభ్యర్ధిని బరిలో దించితే..గ్రౌండ్ రియాలిటీ మరోలా ఉందట..రెబల్ గా నామినేషన్ వేసిన వైసీపీ ద్వితియశ్రేణి నేతలు స్థానిక ఎమ్మెల్యేలకు సవాల్ విసిరారు. అధికారిక అభ్యర్ధులను వెనక్కి నెట్టి మరి విజయతీరాలకు చేరారు. ఇప్పుడు గెలిచినోళ్లు.. ఓడినోళ్లు ఇద్దరూ స్వపక్షమే అయినా ఎమ్మెల్యేలకు మాత్రం కొత్త టెన్షన్ పట్టుకుందట..

2019 ఎన్నికల్లో విశాఖ రూరల్ జిల్లాను వైసీపీ స్వీప్ చేసింది. మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు అధికారపార్టీకి క్యూకట్టేశారు. టీడీపీ కంచుకోటను బద్ధలు కొట్టేసినట్టేనని.. ఇక వైసీపీకి సమీప భవిష్యత్‌లో ఎదురేలేదనే అంచనాలు మొదలయ్యాయి. కానీ.. పంచాయతీ ఎన్నికల నాటికి ఆ రంగు తేలిపోయింది. ఎమ్మెల్యేలకు పల్లెపోరు ఫలితాలు పరీక్షగా నిలబడ్డాయి. అనకాపల్లి సబ్ డివిజన్ పరిధిలోని నాలుగు నియోజకవర్గాల్లో తొలివిడత పంచాయతీ ఎన్నికలు జరిగాయి. వీటిలో అనకాపల్లి, యలమంచిలి, మాడుగుల, చోడవరం ఉన్నాయి. ఈ నియోజకవర్గాల్లో ఫలితాలు అధికారపార్టీ ఎమ్మెల్యేలను ఆఖరి నిమిషం వరకు ఉత్కంఠ కలిగించాయి.

తొలివిడత 340 పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా.. వీటిలో 41 స్థానాలను వైసీపీ ఏకగ్రీవం చేసుకుంది. మిగిలిన 296చోట్ల టీడీపీ పోటీ ఇచ్చింది. జనసేన, బీజేపీ కొన్ని గ్రామాల్లో వార్డులు.. ఒకచోట సర్పంచ్ గెలుచుకున్నా యి. వీటన్నింటి కంటే షాకింగ్ పరిణామం.. రెబల్స్ బరిలో నిలవడం. స్వయంగా ఎమ్మెల్యేలు బుజ్జగించినా చాలాచోట్ల వెనక్కి తగ్గలేదు. పైగా ఎమ్మెల్యేలు పెట్టిన అభ్యర్థులను ఓడించడానికి భారీగా ఖర్చు పెట్టారు. అనుకున్నది సాధించి గెలిచి చూపించారు. ఎన్నికలు ముగిసిన తర్వాత అందరూ అధికారపార్టీకి చెందిన వారే. కానీ.. ఎమ్మెల్యేలతో లీడర్లు, కేడర్‌కు మధ్య గ్యాప్ ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా కనపడింది.

తొలివిడత ఎన్నికలను ఫేస్ చేసిన నలుగురు శాసనసభ్యుల్లో అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, మాడుగుల ఎమ్మెల్యే ముత్యాల నాయుడు, యలమంచిలి ఎమ్మెల్యే రమణమూర్తిరాజు ఉన్నారు. వీరంతా భవిష్యత్‌లో పొలిటికల్ ప్రమోషన్స్ ఆశిస్తున్న నేతలు. అలాంటి శాసనసభ్యులు పల్లెపోరులో ఇంట గెలిచేందుకు కష్టపడాల్సి వచ్చింది. గ్రామాల్లో ఆ పార్టీ శ్రేణులు వర్గాలుగా విడిపోయాయి. సొంత పార్టీలోనే అభ్యర్థుల మధ్య కుమ్ములాటలు కనిపించాయి.

ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబురాజు.. నియోజవర్గంలో రెబెల్స్‌ బెడద ఎదుర్కొన్నారు. మునగపాక మండలంలో గవర కార్పొరేషన్ చైర్మన్ బొడ్డేడ ప్రసాద్ దాదాపు 20గ్రామాల్లో రెబల్స్‌ను నిలబెట్టి గెలిపించారు. ఇక్కడ ఎమ్మెల్యే మనుషులకు ఓటమి తప్పలేదు. ఇదే సీన్‌ చోడవరం, అనకాపల్లి, మాడుగుల నియోజకవర్గాల్లోనూ కనిపించింది. అభ్యర్థుల ఎంపికలో ఎమ్మెల్యేల ప్రయారిటీ మారిపోవడమే ఈ పరిస్థితికి కారణమని పార్టీ వర్గాల వాదన. ఇతర పార్టీల నుంచి తీసుకు వచ్చిన వారిని అందలం ఎక్కించడం.. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయానికి పనిచేసిన వారిని పక్కన బెట్టడంతో అసమ్మతి రాజుకుందట.

వైసీపీ అధికారంలోకి వచ్చాక జరిగిన తొలి ఎన్నికలివి. సర్కార్‌ అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోంది. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో బలంగా కనిపిస్తున్నారు. ఈ లెక్కలు చూసిన తర్వాత పల్లెపోరులో ఫలితాలు అధికార పార్టీకి అనుకూలంగా మారిపోతాయని అనుకుంటే.. అసమ్మతి జ్వాలలు రేగడం ఆందోళన కలిగిస్తోందట.

Read more RELATED
Recommended to you

Latest news