ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ ఇంకా ఖాతా తెరవని నియోజకవర్గాల్లో పరుచూరు ఒకటి.గత రెండు ఎన్నికల్లోనూ వైసీపీ అభ్యర్థులు ఇక్కడ ఓటమిపాలయ్యారు.వరుసగా రెండుసార్లు టీడీపీ ఇక్కడ గెలిచింది.తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఈ నియోజకవర్గానికి చెందిన వారే.2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపి నుండి పోటీచేసి ఓటమిపాలైన వెంకటేశ్వరరావు ఆ తరువాత రాజకీయాలకు దూరమయ్యారు.దీంతో ఇక్కడ ఎడం బలాజిని ఇంచార్జ్ గా నియమించింది వైసీపీ అధిష్ఠానం. టీడీపీ అభ్యర్థిగా మరోసారి బరిలోకి దిగుతున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు.
ఒకప్పుడు ఉమ్మడి ఏపీ రాజకీయాలను మలుపు తిప్పిన కారంచేడు సంఘటన ఈ నియోజకవర్గంలో జరిగిందే.ఈ నియోజకవర్గంలో కారంచేడు,యద్దనపూడి, పరుచూరు, ఇంకొల్లు,చినగంజాం,మార్టూరు మండలాలు ఉన్నాయి. ఇక్కడ మొత్తం ఓటర్లు 2,30,219 మంది ఉన్నారు. ఇందులో మహిళలు 1,17,452 మంది,పురుషులు 1,12,738 మంది ఓటు హక్కు పొందిఉన్నారు.ప్రస్తుతం టిడిపి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పరుచూరు నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.పరుచూరు నియోజకవర్గ ఇంచార్జీగా యడం బాలాజీని నియమించింది వైసిపి అదిష్టానం.అంతకుముందు ఇంచార్జ్ గా ఉన్న మాజీఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ను తప్పించారు.
ఎన్టీఆర్ అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు వరుసగా మూడుసార్లు అనగా 1983,1985,1989 ఎన్నికల్లో టిడిపి నుండి గెలిచారు.ఎన్టీఆర్ మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన దగ్గుబాటి మళ్ళీ వరుసగా రెండుసార్లు 2004,2009 ఎన్నికల్లో విజయం సాధించారు. కానీ 2019 లో మాత్రం టిడిపి చేతిలో దగ్గుబాటి ఓటమిపాలయ్యారు. 2014లో ఇక్కడ టీడీపీ తరపున పోటీ చేసిన ఏలూరు సాంబశివరావు 10,775 ఓట్ల మెజారిటీతో వైసిపి అభ్యర్థి గొట్టిపాటి భరత్ కుమార్ పై గెలిచారు.2019లోను సాంబశివరావు వైసీపీ అభ్యర్థిపై విజయదుందుభి మోగించారు.ఇక్కడ ఇప్పటి వరకు ఖాతా తెరవని వైసీపీ ఈసారి ఎలాగైనా గెలవాలని వ్యూహాలు రచిస్తోంది. ఈ మేరకు పలువురు సీనియర్లను సీఎం జగన్ రంగంలోకి దింపారు.దీంతో ఇక్కడ పోరు ఆసక్తికరంగా మారింది.