వైసీపీ సర్కారు సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తోందా? ప్రభుత్వానికి తీవ్ర ఇబ్బందికర పరిణామంగా దాపురించిన పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రంతో అమీతుమీ తేల్చుకునేందుకు రెడీ అవుతోందా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. ఒకనాడు చంద్రబాబు కూడా కేంద్రంతో మంచిగా ఉన్నారు. అయితే, ఎంతకీ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కేంద్రం మొండిగానే వ్యవహరిస్తుండడం, కనీసం విభజన చట్టం ప్రకారం కూడా ముందుకు సాగకపోవడం.. ఏపీ విషయంలో తీవ్ర నిర్లిప్తతను మోడీ సర్కారు అవలంభించడంపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అప్పటికే కేంద్రంలో మంత్రులుగా ఉన్నవారితో రాజీనామాలు చేయించారు. ఎంపీలతో ప్రధాని నివాసాన్ని ముట్టడించే ప్రయత్నం చేశారు. ఇక, ఇప్పుడు ఇదే పరిస్థితి వైసీపీకి కూడా వస్తోందని అంటున్నారు పరిశీలకులు. ఆనాడు ప్రత్యేక హోదాపై చంద్రబాబు కేంద్రంతో తెగతెంపులు చేసుకుంటే.. ఇప్పుడు జగన్ పోలవరం విషయంలో కేంద్రంతో కయ్యానికి రెడీ అయ్యేందుకు సిద్ధమవు తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఆయన దీనిపై న్యాయనిపుణులు, తన రాజకీయ, సర్కారు సలహాదారులతోనూ చర్చించినట్టు తెలుస్తోంది.
అయితే, ముందుగా కేంద్రానికి ఓ ఛాన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో పోలవరంపై ప్రధానికి నేరుగా లేఖరాశారని అంటున్నారు. అదే సమయంలో ప్రధాని నరేంద్ర మోడీని అప్పాయింట్‌మెంట్ కూడా కోరారని, కానీ, ఇప్పుడున్న పరిస్థితిలో మోడీ జగన్‌కు అప్పాయింట్‌మెంట్ ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదని అంటున్నారు. బిహార్ ఎన్నికలు ఉన్నందున అప్పాయింట్‌మెంట్ ఇవ్వకపోవచ్చు.
అయితే, మోడీతో చర్చించే వరకు ఆగి.. అప్పటికీ.. పోలవరం నిదుల విషయంలో కేంద్రం కనుక ఏపీకి అనుకూలంగా నిర్ణయం తీసుకోని పక్షంలో తన ఎంపీలతో రాజీనామాలు చేయించి.. ప్రజల్లోకి వెళ్లాలని, కేంద్రాన్ని గట్టిగా నిలబెట్టాలనిజగన్ భావిస్తున్నారని తెలుస్తోంది. ఇదే విషయంలో .. ఆయన సలహాదారులు కూడా ఓకే చెప్పారని అంటున్నారు. మొత్తానికి వచ్చే ఎన్నికల వరకు ఆగకుండా.. వచ్చే 3 మాసాల్లోనే దీనిపై గట్టి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.