ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని యూపీలో అధికారంలో ఉన్న యోగీ ప్రభుత్వం ఆరుసూత్రాల ప్రణాళిక ప్రకటించింది. త్వరలో వన మహోత్సవం ఏర్పాటు చేసి 35 కోట్ల మొక్కల్ని నాటాలని నిర్ణయించారు ఆదిత్యనాథ్. ప్రజల్లో పర్యావరణంపై అవగాహన కల్పించడంతో పాటు దాన్ని కాపాడేందుకు తీసుకోవాల్సిన చర్యలను సూచిస్తూ ఆన్ లైన్లో ఏకంగా 58 వేల మంది సర్పంచ్ లతో సీఎం ఓ ప్రతిజ్ఞ కూడా చేయించారు.
కాలుష్యం దుష్ప్రభావాలను తగ్గించేందుకు ప్రజల నుంచి మద్దతు కావాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కోరారు. 58,000 మంది గ్రామపెద్దలకు ఆన్‌లైన్‌లో ప్రతిజ్ఞ చేయిస్తూ, జూలై మొదటి వారంలో వారం రోజుల పాటు జరిగే వన మహోత్సవంలో ప్రతి గ్రామం భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. ప్రతిఒక్కరు బాధ్యతగా మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించే బాధ్యతను తీసుకోవాలని సూచించారు.
గ్రామ పెద్దలు, మున్సిపాలిటీ మరియు పట్టణ ప్రాంతాలకు కొత్తగా ఎన్నికైన చైర్‌పర్సన్‌లతో పాటు గోరఖ్‌పూర్ మున్సిపల్ కార్పొరేషన్, పంచాయతీరాజ్ సంస్థల అధికారులతో కలిసి ప్లాస్టిక్ కాలుష్యాన్ని అరికట్టడానికి, అటవీ పునరుద్ధరణకు మద్దతుగా ఈ ప్రతిజ్ఞ చేశారు. ప్లాస్టిక్ వల్ల ఏర్పడే కాలుష్యం పర్యావరణానికి హానికరమని చెప్పిన యోగి ఈ ఏడాది ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఇతివృత్తంగా ప్లాస్టిక్ కాలుష్యానికి పరిష్కారం ఇస్తామని తెలిపారు.
రాష్ట్రంలో 2018లోనే ప్లాస్టిక్ నిషేధించినట్లు యోగీ ఆదిత్యనాథ్ గుర్తుచేశారు. ఒక్కసారి వాడే ప్లాస్టిక్ వినియోగం పాపంతో సమానమని, ఆవు దానిని తిన్న తర్వాత చనిపోవచ్చని యోగీ హెచ్చరించారు. నాశనం చేయలేని వస్తువుగా, ప్లాస్టిక్ మాతృభూమి ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుందన్నారు. ప్లాస్టిక్ నుండి పర్యావరణాన్ని రక్షించడానికి యోగీ ఆదిత్యనాథ్ ఆరు సూత్రాల మంత్రాన్ని కూడా ప్రకటించారు. ఇందులో తగ్గించు, పునర్వినియోగం, రీసైకిల్, రికవర్, రీఫ్యాబ్రికేట్, రిపేర్ ఉన్నాయి.ఈ ఆరు సూత్రాల ఆధారంగా ఉత్తర ప్రదేశ్ ని పరిశుభ్రంగా మారుస్తామని తెలియజేసారు. అన్ని వర్గాల వారు ఇందులో భాగస్వాములై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. మొక్కలను అందరికీ ప్రభుత్వమే నేరుగా అందిస్తుందని చెప్పారు.