ఏపీ సీఎం జగన్ మరో కీలక పథకాన్ని అమలలోకి తెచ్చారు. జగనన్న వసతి దీవెన పేరుతో ఈ పథకాన్ని సోమవారం విజయన గరం వేదికగా ఆయన ప్రారంభించారు. ఇప్పటి వరకు అనేక సంచలన పథకాలను ప్రారంభించి ప్రజల అభిమానం చూరగొన్న ముఖ్యమంత్రి అమ్ముల పొది నుంచి మరో కీలక పథకం అమలుకు నోచుకోవడం, అది కూడా లక్షల సంఖ్యలో ఉన్న విద్యార్థుల కు సంబందించిన పథకం కావడంతో సంచలనంగా మారింది. పేద విద్యార్థులకు ప్రతి ఏటా రూ.20 వేలు వసతి దీవెన పథకం కింద అందించనున్నారు. నేరుగా విద్యార్థుల ఖాతాల్లోకే ఈ సొమ్ము చేరిపోనుంది.
డిగ్రీ, పీజీ జరిగే విద్యార్థులకు రెండు విడతలుగా రూ.20 వేలు ఇస్తారు. వసతి, భోజనం ఖర్చుల కోసం విద్యార్థుల తల్లులకు ఈ మొత్తం చేరడం ద్వారా విద్యార్థులకు ఇచ్చే సొమ్ము విషయంలో ఆయా కుటుంబాలు ఆర్థిక భారం తగ్గుతుందని ప్రభుత్వం చెబుతోంది. కుటుంబంలో ఎంతమంది విద్యార్థులుంటే అంతమందికి ఇవ్వడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం కావడంతో ఆయా కుటుంబాల్లో సంతోషం వెల్లివిరుస్తోంది.
రాష్ట్ర వ్యాప్తంగా 1 లక్ష 87వేల మందికి ఈ పథకం వర్తిస్తుంది. వసతి దీవెన కింద రూ. 2,300 కోట్లు ఖర్చు చేయనున్నట్టు సమాచారం. ఈ పథకం ద్వారా పేదల జీవితాలలో మార్పు తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో విద్యా దీవెన పథకం కింద ఏడాదికి 3,700 కోట్లు ఖర్చు చేయబోతున్నారు. ఈ రెండు పథకాలతోనే 6,000 కోట్లు ఖర్చు చేస్తుండడం గమనార్హం. అదేసమయంలో అమ్మ ఒడి పథకం ద్వారా 6,400 కోట్లు ఖర్చు ఈ ఏడాది జనవరిలో ఇచ్చిన విషయం తెలిసిందే.
మొత్తంగా ఈ రెండు పథకాల ద్వారా జగన్ రాజకీయంగాను, ఇటు ప్రజల సంక్షేమంలోనూ మరో మెట్టు ఎక్కారని అంటున్నారు విశ్లేషకులు. నిజానికి ఇప్పుడున్న పరిస్థితిలో రాష్ట్రం అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. అయినా కూడా జగన్ విద్య విషయానికి వచ్చే సరికి ఇస్తున్న ప్రాధాన్యం ఈ పథకాల అమలులో కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గత ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చి కూడా ఎన్నికలకు ముందు తప్ప అమలు చేయకపోవడాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేస్తుండడం గమనార్హం.