ఆ మంత్రుల‌కు జ‌గ‌న్ వార్నింగ్‌… ఇంటికి పంపేస్తాడా… !

-

సార్వ‌త్రిక ఎన్నిక‌లు ముగిసి జ‌గ‌న్ ప్ర‌బుత్వం కొలువుదీరి ప‌ట్టుమ‌ని ప‌ది మాసాలైనా కాక‌ముందే.. మ‌రో వార్‌కు పార్టీ సిద్ధం అయింది. కేవ‌లం నెల రోజుల్లోనే స్థానిక సంస్థ‌ల‌కు ఎన్నిక‌లు పూర్తి చేయాల‌ని జ‌గ‌న్ నిర్ణ‌యించేశారు. నిన్న మొన్న‌టి వ‌ర‌కురిజ‌ర్వేష‌న్ అంశం క‌ల‌వ‌ర‌ప‌ర‌చ‌గా.. దీనిపై హైకోర్టు క్లారిటీ ఇచ్చింది. దీంతో ఇప్పుడు జ‌గ‌న్ పూర్తిగా స్తానికంపై దృష్టి పెట్టారు. ఈ నెల 9 న స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు నోటిఫికేష‌న్‌కూడా రానుంద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే, ఈ క్ర‌మంలో స్థానిక ఎన్నిక‌ల‌కు సంబంధించి జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకున్నారు. రాష్ట్రంలో పూర్తిగా స్థానికంలో వైసీపీ జెండానే ఎగ‌రాల‌ని జ‌గ‌న్ నిర్ణ‌యించారు. అయితే, ఈ బాధ్య‌త‌ను పూర్తిగా మంత్రులు, ఎమ్మెల్యేల‌పైనే ఆయ‌న పెట్టారు.

హై కోర్టు ఆదేశాలతో బీసీలకు 24 శాతం రిజర్వేషన్లు ఇవ్వాల‌ని జ‌గ‌న్ నిర్ణ‌యించారు. అదేస‌మ‌యంలో దీనిని ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్ల‌డంతోపాటు.. స్థానిక సంస్థల ఎన్నికల బాధ్యత ఇంఛార్జి మంత్రులు, జిల్లా మంత్రులదేన‌ని, ఎమ్మెల్యేలు కూడా భాగ‌మేన‌ని సీఎం జ‌గ‌న్ హెచ్చ‌రించారు. తాజాగా నిర్వ‌హించిన కేబినెట్ మీటింగ్‌లో ఈ విష‌య‌మే ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు వ‌చ్చింది. జిల్లాలో పార్టీ నాయకత్వం మధ్య ఉన్న గ్రూపు తగాదాలు నేపథ్యంలో సరిదిద్దాలని మంత్రులకు సూచించిన జ‌గ‌న్‌.. ఎన్నిక‌ల‌ను ప‌టిష్టంగా నిర్వ‌హించే బాధ్య‌త‌ను కూడా వారికి అప్ప‌గించారు. ఎన్నిక‌ల్లో ఎక్క‌డా చుక్క మందు కానీ, రూపాయి కాసు కానీ పంపిణీ చేయ‌డానికి వీల్లేద‌ని ష‌ర‌తు పెట్టారు.

ఎక్కడైనా ఫలితాల విషయంలో తేడా వస్తే మంత్రులు వెంటనే రాజీనామా చేయాల్సిందేనని స్పష్టం చేసిన‌ట్టు తెలిసింది. అదేస‌మ‌యంలో రెండున్న‌రేళ్ల త‌ర్వాత మంత్రులుగా అవ్వాల‌నే ఆశ‌లు పెట్టుకునేవారు కూడా ఈ ఎన్నిక‌ల్లో క‌ష్ట‌ప‌డాల్సిందేన‌ని జ‌గ‌న్ స్ప‌ష్టం చేయ‌డం గ‌మ‌నార్హం. అంతేకాదు, ఎమ్యెల్యే లకు వచ్చే ఎన్నికల్లో సీట్లు ఇచ్చేది కూడా ఈ ఎన్నిక‌ల్లో వ‌చ్చిన రిజ‌ల్ట్ బ‌ట్టేన‌ని స్ప‌ష్టం చేయ‌డం గ‌మ‌నార్హం. ఈ నెల 8 వరకూ పార్టీ నేతలతో కార్యకర్తలతో సమావేశం నిర్వహించి ఎన్నికలకు సన్నద్ధం కావాల‌ని సూచించారు. మొత్తంగా చూస్తే.. ఇప్పుడు స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు మంత్రుల‌కు, ఇంచార్జ్ మంత్రుల‌కు, ఎమ్మెల్యేల‌కు చెమ‌ట‌లు ప‌ట్టించ‌నున్నాయ‌న‌డంలో సందేహం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news