నెల్లూరు జిల్లా ఇప్పుడు రాష్ట్ర రాజకీయానికి వేదిక అవుతోంది. ఆంధ్రా అగ్రనేతలు సీఎం జగన్, ప్రతిపక్షనేత చంద్రబాబు.. ఇద్దరూ ఒకే రోజు ఈ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో వున్న చంద్రబాబు నెల్లూరు జిల్లాలో పార్టీ పరిస్థితిపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో ఆయన రెండో రోజు పర్యటిస్తున్నారు.
పార్టీ బలోపేతం, కార్యకర్తల్లో ధైర్యం నింపడమే లక్ష్యంగా ఆయన పర్యటన సాగుతోంది. రెండు రోజుల పర్యటనలో భాగంగా మొదటి రోజు ఉదయయగిరి, సూళ్లూరుపేట, వెంకటగిరి, గూడూరు అసెంబ్లీ నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలతో సమీక్ష నిర్వహించారు చంద్రబాబు. ఈరోజు మరికొన్ని నియోజకవర్గాల నేతలు, కార్యకర్తలతో సమావేశం అవుతారు. గత ఎన్నికల్లో టీడీపీ ఈ జిల్లాలో కనీసం ఖాతా తెరవలేదు.
అదే సమయంలో సీఎం జగన్ కూడా నెల్లూరు జిల్లాలోనే ఉన్నారు. రైతు భరోసా కార్యక్రమాన్ని ఈ జిల్లా నుంచే ప్రారంభిస్తున్నారు. దీంతో రాష్ట్రంలోని అగ్రనేతలిద్దరూ ఒకే రోజు ఒకే జిల్లాలో ఉండటం ఆసక్తిరేపుతోంది. నెల్లూరు రాజకీయం వేడెక్కింది. మరోవైపు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఈ జిల్లాను క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం పదికి పది సీట్లు గెలుచుకుంది.
కాకపోతే.. ఇటీవల ఆ పార్టీలోని లుకలుకలు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అరెస్టుకు దారి తీశాయన్న విశ్లేషణలు వినిపించాయి. ఈ విషయంపై శ్రీధర్ రెడ్డి బహిరంగంగంగానే కాకాణి గోవర్థన్ రెడ్డిపై విమర్శలు చేశారు. జగన్ పర్యటన నేపథ్యంలో వీరి విబేధాలు మరోసారి చర్చకు వస్తున్నాయి. జగన్ వీరిద్దరినీ పిలిచి మాట్లాడే అవకాశం ఉంది. మొత్తం మీద నెల్లూరు రాజకీయం వైపు రాష్ట్రమంతా చూస్తోందిప్పుడు.