నాకు నచ్చని పదం ఏదైనా ఉంటి .. అదిపొగడ్త..! – తరచుగా వైసీపీ అధినేత తన పార్టీ నాయకులకు చెప్పే మాట ఇది. ప్రజల నుంచి మాత్రమే పొగడ్తలు రావాలని ఆకాంక్షించే నాయకుల్లో ఆయన ముందుంటారు. ఆయన ఎప్పుడూ స్వగతాన్ని డబ్బా కొట్టుకునే పరిస్థితి ఇప్పటి వరకు కూడా కనిపించలేదు. గడిచిన ఆరు మాసాల్లో ఆయన అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అనేక పథకాలను తీసుకు వచ్చారు. దేశంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వమూ అమలు చేయని విధంగా గ్రామ సచివాలయ వ్యవస్థకు నాంది పలికారు. అదేసమయంలో దేశం మొత్తం ఉల్లి కల్లోలంతో అట్టుడికి పోయినప్పుడు ఏపీలో జగన్ తీసుకున్న నిర్ణయం ప్రజలకు ఎంతో ఉపశమనం కల్పించింది. కిలో రూ.25కే ఆయన రైతు బజార్ల ద్వారా ఉల్లిని అందుబాటులోకి తెచ్చారు.
మరి ఇంత చేసినాకూడా ఎక్కడాడబ్బా కొట్టుకోలేదు. కట్ చేస్తే.. జగన్‌కు నచ్చని ఈ పొగడ్తల రాజకీయం.. ఆయన పార్టీ నాయకులకు, మంత్రులకు అంటుకొంది. ఏ వేదికెక్కినా.. ఎక్కడ మాట్లాడినా.. జగన్‌పై నాలుగు ప్రశంసలు, రెండు పొగడ్తలు అనే విధంగా వారు వ్యవహరిస్తున్నారు. నిజానికి పొగడ్తల రాజకీయాలకు కొన్నాళ్లుగా టీడీపీ పెట్టింది పేరు. ఈ పార్టీలో ప్రతి ఒక్కరూ చంద్రబాబు ను సందర్భం ఉన్నా.. లేక పోయినా.. ఆకాశానికి ఎత్తేశారు. ఊ.. అంటే చాలు బాబును ఆయన కుమారుడిని కూడా ఆకాశానికి ఎత్తేసిన నాయకులు చాలా మంది ఉన్నారు. దీంతో అసలు క్షేత్రస్థాయిలో పరిస్థితి అధినేత దృష్టికి చేరలేదనేది వాస్తవం.
అందరూ పొగుడుతుంటే, అందరూ ప్రశంసిస్తూ ఉంటే.. వాటినే నిజమను కున్న చంద్రబాబు క్షేత్రస్థాయిలో పార్టీకి ఎదురైన వ్యతిరేకతను గుర్తించడంలో చాలా వరకు విఫలమయ్యారు. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడిపోవడానికి కూడా కారణమైందనేది వాస్తవం. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వైసీపీలోనూ కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. జగన్ అనేక పథకాలు ప్రవేశపెట్టి ఉండొచ్చు, అనేక కార్యక్రమాలు అమలు చేస్తుండొవచ్చు.. కానీ, అవి క్షేత్రస్థాయిలోకి నిఖార్సుగా వెళ్లి, లబ్ధి దారులకు లాభం చేకూరుతేనే ఆశించిన ప్రయోజనం ఉంటుందనే విషయాన్ని పక్కన పెడుతున్న కొందరు మంత్రులు, నాయకులు తమ తమ పదవులు కాపాడుకునేందుకు,
తమ మాటలను చెల్లుబాటు చేసుకునేందుకు పొగడ్తల రాజకీయానికే ప్రాధాన్యం ఇస్తున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది. అటు బయట, ఇటు సభలోనూ కూడా వైసీపీ నేతలు.. జగన్‌పై పొగడ్తలకే ప్రాధాన్యం ఇస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. అలా కాకుండా ఉన్నది ఉన్నట్టు ప్రజెంట్ చేయగలిగితేనే పార్టీ పరిస్థితి, క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ విషయాలు వైసీపీ అధినేతకు తెలియడంతోపాటు.. మున్ముందు మార్పులు, చేర్పులకు కూడా అవకాశం ఉంటుందని, ఫలితంగా పార్టీ మరిన్ని సంవత్సరాలు అధికారంలో ఉండేందుకు అవకాశం ఉంటుందని అంటున్నారు పరిశీలకులు. మరి వైసీపీ నాయకులు ఈ సూచనలను పాటిస్తారో లేదో చూడాలి.