ఆంధ్రావని వాకిట కొత్త మంత్రివర్గం కొలువు దీరింది. దీంతో జగన్ అనుకున్న విధంగా పాత కొత్తల మేలు కలయికతో మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ లేదా విస్తరణ అన్నది సాధ్యం అయింది. జగన్ తన నేతృత్వంలో గతంలో పనిచేసిన 11 మందిని తిరిగి పాలకవర్గంలో తీసుకున్నారు. అమాత్యుల కూటమిలో కొత్త వారు 14 మంది ఉన్నారు. వీరిని కూడా సామాజిక వర్గ సమీకరణాలు ఆధారంగానే నియమించి, బాధ్యతలు అప్పగించారు.
కీలక వైద్యారోగ్యం, హోం, పర్యాటకం తదితర శాఖలు మహిళలకే కేటాయించారు. గతంలో మాదిరిగానే హోం శాఖను ఎస్సీ మహిళకు కేటాయించి, సెంటిమెంట్ ను రిపీట్ చేశారు. అదేవిధంగా మొదట్నుంచి విధేయులుగా ఉన్నవారికీ చోటు ఇచ్చారు. మంత్రివర్గ కూర్పులో సామాజిక న్యాయం పాటించిన వైనంపై కూడా ముఖ్యమంత్రికి మంచి మార్కులే పడ్డాయి.
తానేటి వనితకు హోం ఇవ్వడంతో అక్కడ తూర్పు వాకిట సంబరాలు నెలకొన్నాయి. అదేవిధంగా మరో విధేయురాలు, మొదట నుంచి జగన్ వెంట నడిచిన రోజాకు పర్యాటక శాఖ దక్కింది. మరో నాయకురాలు విడదల రజని కీలక వైద్యారోగ్యం దక్కించుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. ఉష శ్రీ చరణ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ ను దక్కించుకుని అనంత రాజకీయాలను మరో మారు ప్రభావితం చేయనున్నారు.
ఇక అసంతృప్తుల విషయానికే వస్తే జగన్ మొదట్నుంచి చెబుతున్న విధంగానే రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే కూర్పు ఉంది. అయితే తొలి నుంచి పదవి ఆశించిన వారు, ఆ రోజు కష్ట కాలంలో జగన్ కు అండగా ఉన్న సామినేని ఉదయ భాను లాంటి వారు కాస్త అలిగిన మాట వాస్తవమే. ఆయనతో పాటు పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి కూడా అలక బూనారు. వీరితో పాటు నిన్నమొన్నటి హోం మంత్రి మేకతోటి సుచరిత కూడా తన అసహనం లేదా అసంతృప్తి వ్యక్తం చేశారు.
వీరిలో మొదటి ఇద్దరూ సీఎం వెంటే ఉంటామన్నారు. బుజ్జగింపులు కూడా ఫలించాయి. మేకతోటి సుచరిత విషయమే కాస్త సందిగ్ధంగా ఉంది. ఆఖరుగా జగన్ మామ బాలినేని శ్రీనివాస్ రెడ్డి కూడా దిగివచ్చారు. తామంతా ఒకే కుటుంబం అని చెప్పి కార్యకర్తలలో ఉత్సాహం నింపి తన విషయమై ఎవ్వరూ రాజీనామాలు చేయవద్దని విన్నవించారు. అదేవిధంగా పిన్నెల్లి ప్రకటనలో కూడా స్పష్టత ఉంది.
ఆయన కూడా ఇదే విధంగా భావోద్వేగాలకు లోనుకావద్దని కార్యకర్తలకు విన్నవించి సమస్యను సులువుగానే పరిష్కరించి జగన్ దగ్గర మళ్లీ మార్కులు కొట్టేశారు. ముఖ్యంగా ఎక్కువగా అసంతృప్తి ఉంది అని భావించిన కృష్ణా, గుంటూరు జిల్లాల నేతలతో ముఖ్యమంత్రి ప్రత్యేకించి సమావేశం అవ్వడంతో సమస్య పరిష్కారం అయింది. అసంతృప్తుల జాబితాలో ఉన్న కొలుసు పా