ఏపీలో తాజాగా ముగిసిన ఎన్నికల్లో ఏ ఒక్కరూ ఊహించని విధంగా అధికార టీడీపీ ఘోరంగా ఓడిపోగా, ఈ సారి కూడా అనుమానమేనని భావించిన విపక్ష వైసీపీ బంపర్ మెజారిటీతో విక్టరీ కొట్టింది. ఈ ఫలితాలతో ఒక్కసారిగా పరిస్థితులు అన్నీ మారిపోయాయి. అప్పటిదాకా కాస్తంత ప్రశాంతంగానే కాకుండా రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కొనే విషయంలో తమదైన శైలి సత్తా చాటిన తెలుగుదేశం పార్టీ నేతలు ఎన్నికల ఫలితాల తర్వాత డంగైపోక తప్పడం లేదు.
గతంలో వైసీపీ నేతలపై తమదైన శైలిలో సత్తా చాటిన టీడీపీ నేతలు ఇప్పుడు కేసుల్లో ఇరుక్కుంటున్నారు. ఇలాంటి నేతల్లో ఇప్పటికే సత్తెనపల్లి మాజీ ఎమ్మెల్యే, తాజా మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై కేసు నమోదైపోగా… ఈ ఘటన జరిగిన రెండు రోజులకే కోడెల జిల్లాకు చెందిన గురజాల తాజా మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుపైనా విచారణకు రంగం సిద్ధం అయిపోయింది.
గురజాలలో అక్రమ మైనింగ్ సాగిస్తున్నారంటూ యరపతినేనిపై చాలా కాలం నుంచి వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికలకు కాస్తంత ముందుగా హైకోర్టు జోక్యంతో యరపతినేనిపై సీఐడీ దర్యాప్తు షురూ కాగా… సీఐడీ విచారణలో వైసీపీ వాదన నిజమేనని తేలిపోయింది. యరపతినేని అక్రమ మైనింగ్ చేశారన్న ఆరోపణలకు సంబంధించి వైసీపీ అందించిన ఆధారాలను పరిశీలించిన హైకోర్టు… ఆయనపై సీబీఐ దర్యాప్తునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఎన్నికలకు చాలా కాలం ముందు నుంచే యరపతినేనిపై తన సొంత నియోజకవర్గానికి చెందిన కాసు మహేశ్ రెడ్డితో పాటు పొరుగు నియోజకవర్గాలకు చెందిన వైసీపీ నేతలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిలు ముప్పేట దాడిని దిగారు. అయినా కూడా టీడీపీ అధికారంలో ఉండగా… వారి ఆరోపణలు నిజమని తేలలేదు.
అయితే ఇప్పుడు వైసీపీ అధికారంలోకి రాగానే యరపతినేని నేరం చేసినట్టుగా సీఐడీ నివేదిక ఇవ్వడం, ఆ నివేదిక ఆధారంగా హైకోర్టు సీబీఐ దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేయడం చకచకా జరిగిపోయాయి. మొత్తంగా వైసీపీ నేతలు టార్గెట్ చేసిన టీడీపీ నేతల్లో ఇప్పటికే కోడెల బుక్ అయిపోగా, తాజాగా యరపతినేని కూడా బుక్ అయిపోయారని, మరి రేపు ఎవరి వంతు అన్న ఆసక్తికర వాదనలు వినిపిస్తున్నాయి.