తెలంగాణలో అధికార టీఆర్ఎస్ను ఎలాగైనా గద్దె దించాలని… 2023 ఎన్నికల్లో విజయం సాధించానలి కమలదళం ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించినట్టు కనపడుతోంది. ఎన్నికలకు మరో నాలుగేళ్ల టైం ఉన్నా బీజేపీ హడావిడి క్షేత్రస్థాయిలో ఇప్పటి నుంచే ప్రారంభమైంది. ప్రతి విషయంలోనూ రెండు పార్టీల నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. చివరకు సభ్యత్వ నమోదు విషయంలోనూ వీరి మధ్య తీవ్రమైన మాటల యుద్ధం నడుస్తోంది. బోగస్ సభ్యత్వాలు అంటూ పరస్పరం నిందారోపణలు చేసుకుంటూ ఇరు పార్టీల నేతలు సవాళ్లు విసురుకుంటున్నారు.
ఏ పార్టీకి అయినా సభ్యత్వ నమోదు రెండేళ్లకు ఒకసారి జరుగుతూ ఉంటుంది. పార్టీ అధ్యక్షులు ఎవరైనా రెండేళ్ల పాటు కొనసాగుతూ ఉంటారు. టీఆర్ఎస్ సభ్యత్వ నమోదును కేసీఆర్ జూన్ 27న ప్రారంభించారు. మొత్తం కోటిమందిని టార్గెట్గా పెట్టుకుని సభ్యత్వాలు చేర్చాలని ఆయన టార్గెట్ పెట్టగా… టీఆర్ఎస్ శ్రేణులు ఇప్పటి వరకు 60 లక్షల మందికి సభ్యత్వం ఇచ్చినట్టు లెక్కుల చూపిస్తున్నారు. ఈ 60 లక్షల్లో 20 లక్షల మంది తమ పార్టీ క్రియాశీలక సభ్యులని కూడా కేటీఆర్ ప్రకటించారు. అలాగే ఒక్కో నియోజకవర్గంలో సగటును 50 లక్షల సభ్యత్వాలతో దేశంలోనే ఎక్కువ సభ్యత్వాలు ఉన్న పార్టీగా టీఆర్ఎస్ రికార్డు సృష్టించిందని కూడా ఆయన తెలిపారు.
బీజేపీ ఎటాక్…
ఇక తెలంగాణలో ఎలాగైనా కేసీఆర్ను గద్దె దించాలని బీజేపీ కొద్ది రోజులుగా విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే గత లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీకి నాలుగు ఎంపీ సీట్లు రావడంతో ఎక్కడా లేని ఉత్సాహంతో దూసుకు వెళుతోంది. బీజేపీ కూడా జూలై 6న సభ్యత్వ నమోదు ప్రారంభించింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా స్వయంగా రాష్ట్రానికి వచ్చి సభ్యత్వ నమోదు ప్రారంభించారు.
రెండు పార్టీల సభ్యత్వాల నమోదు ముగింపు దశకు చేరుకుంటున్న టైంలో పార్టీ రాష్ట్ర నాయకులు ఒకరిపై మరొకరు తీవ్రమైన విమర్శలు చేసుకుంటున్నారు. టీఆర్ఎస్ సభ్యత్వాలన్ని బోగస్సే అని… ఆ పార్టీ నాయకులే జాబితాలు తయారు చేశారని బీజేపీ తీవ్రంగా విమర్శించింది. బీజేపీపై టీఆర్ఎస్ కూడా తీవ్రంగా స్పందిస్తూ మిస్డ్కాల్ సభ్యత్వాలు అంటూ సెటైర్ వేసింది.
బీజేపీ మిస్డ్కాల్ సభ్యత్వాలు కూడా కలుపుకుంటే ఆ పార్టీ సభ్యుల సంఖ్య 13 లక్షలు అని చెప్పుకుంటోందని టీఆర్ఎస్ ప్రతి విమర్శలు చేసింది. బీజేపీ తరహాలో మిస్డ్కాల్ సభ్యత్వాలు చేయాలనుకుంటే గంట వ్యవధిలో మూడు కోట్లు చేస్తామని ఎద్దేవా చేసింది. ఏదేమైనా భవిష్యత్తులో తెలంగాణలో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ మధ్య పొలిటికల్ యుద్ధం మామూలుగా ఉండేలా లేదు.