హైదరాబాద్.. పెరుగుతున్న వాహనాల రద్దీ.. కమ్ముతున్న కాలుష్యం.. కారణం కరోనానేనా?

మనుష్యుల జీవితాల్లో కరోనా తీసుకువచ్చిన మార్పు అంతా ఇంతా కాదు. సాధారణ పరిస్థితులనేవి అందని ద్రాక్షలా మారిపోయాయి. పిల్లలు బడికి వెళ్ళడం, రోడ్ల మీద అల్లరిగా తిరిగే కాలేజీ యువత కనుమరుగైపోయారు. ఎక్కడికి వెళ్ళాలన్నా భయం, ఏది ముట్టుకోవాలన్నా వణుకు పుట్టుకుంది. ఐతే కరోనా లాక్డౌన్ టైమ్ లో ఏదైనా మంచి జరిగిందంటే అది కాలుష్యం తగ్గడం ఒక్కటే. అప్పటి వరకూ కాలుష్యంతో నిండిన ఆకాశం, నెలరోజులుగా ఎలాంటి ఉద్గారాలు విడుదల కాకపోవడంతో తనలోని నిర్మలత్వాన్ని బయటపెట్టింది. అందువల్లే ఎంతో దూరంలో ఉన్న హిమాలయాలు కూడా కనిపించాయి.

ఐతే ఎంత త్వరగా కాలుష్యం కనుమరుగైందో అంతే తొందరగా కాలుష్యం పెరుగుతుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో కాలుష్యం కాటు వేస్తుంది. రోడ్ల మీద వాహనాల రద్దీ విపరీతంగా పెరుగుతుంది. కరోనా మూలంగా పబ్లిక్ వాహనాల్లో వెళ్ళడానికి భయపడుతున్న జనం, సొంత వాహనాలకే ప్రాముఖ్యత ఇస్తున్నారు. దానివల్ల రోడ్లమీదకి వచ్చే వాహనాల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. దీనివల్ల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. శ్వాస సంబంధ వ్యాధులు, పాంక్రైటిస్ సమస్యలు పెరుగుతున్నాయని నిపుణూలు తెలుపుతున్నారు.