ముఖ్యమంత్రి కేసీఆర్ చేసేది చెప్తాడు.. చెప్పింది చేస్తాడు. అలవికానీ వాగ్దానాల జోలికి వెళ్లకుండా ఇచ్చిన హామీలను అమలు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెసోళ్ల లెక్క బక్వాస్, బోగస్ హామీలు ఇవ్వడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ఏమీ ఇవ్వరు. ఇక్కడ మాత్రం అలవికానీ అమలు ఇస్తున్నారని మండిపడ్డారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలంలోని పడగల్ గ్రామంలో ప్రభుత్వం నూతనంగా నిర్మించిన రెండు పడక గదుల ఇళ్ల సముదాయాన్ని బుధవారం ప్రారంభించిన మంత్రి లబ్ధిదారులతో కలిసి ప్రత్యేక పూజలు చేసి పాలు పొంగించారు.
పడగల్ గ్రామాభివృద్ధి, సంక్షేమం కోసం 71కోట్ల రూపాయలు వెచ్చించామని రహదారులు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రజలకు వివరించారు. 14 ఏళ్లపాటు కేసీఆర్ ఏకైక లక్ష్యంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ధీరుడని కొనియాడారు. ఉద్యమంలో రాజకీయ పార్టీల ఉద్దండులతో ఎన్నో ఇబ్బందులను ఎదురించి నాలుగు కోట్ల ప్రజానీకాన్ని ఏకం చేసి రాజకీయ పార్టీల మెడలు వంచి కేసీఆర్ తెలంగాణ సాధించారని మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణ సాధనతోనే నేడు గ్రామాల్లో అభివృద్ధి, సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున అందించగలుగుతున్నామన్నారు. కేసీఆర్ ప్రభుత్వ పాలనలో పేదవారికే ప్రాధాన్యం తప్పా, పైరవీలకు ఏమాత్రం అవకాశం ఉండదని స్పష్టం చేశారు.