ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోని అసంఘటిత రంగంలో పనిచేస్తున్న వారి కోసం గతంలో ప్రధాన మంత్రి శ్రమ్ యోగి మాన్ ధన్ పేరిట ఓ నూతన పెన్షన్ స్కీంను ప్రవేశపెట్టారు. మొత్తం 3 పెన్షన్ స్కీంలను ప్రవేశపెట్టగా అందులో ఈ స్కీంలోనే ఎక్కువ మంది చేరుతున్నారు. ఇప్పటి వరకు ఇందులో మొత్తం 44,27,264 మంది చేరినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇందులో రైతులు, వ్యాపారులు, కార్మికులు ఎక్కువగా చేరుతున్నారు. ఈ స్కీంలో చేరిన వారు 60 సంవత్సరాలు నిండాక నెల నెలా రూ.3వేల వరకు పెన్షన్ పొందవచ్చు. ఇక పెన్షన్ పొందేవారు చనిపోతే వారి నామినీలకు పెన్షన్ మొత్తంలో సగాన్ని నెల నెలా అందజేస్తారు.
2019వ సంవత్సరం మార్చి 5వ తేదీన మోదీ ఈ కార్యక్రమాన్ని గుజరాత్‌లోని గాంధీనగర్‌లో తొలుత ప్రారంభించారు. ఈ పథకంలో చేరేందుకు అప్పటి నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా ప్రారంభించారు. ఇక ఇందులో ఈపీఎఫ్‌వో, ఈఎస్ఐసీ, ఎన్‌పీఎస్ ఖాతాదారులు చేరేందుకు అనర్హులు. కేవలం అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న వారికి మాత్రమే ఈ స్కీం వర్తిస్తుంది. నెలకు రూ.15వేలు అంతకన్నా తక్కువ వేతనంతో పనిచేసేవారు ఇందులో చేరవచ్చు. దీంతో దేశంలో ఉన్న 42 కోట్ల మందికి లబ్ధి కలగనుందని అంచనా వేస్తున్నారు.
దేశంలో ఈ స్కీంలో హర్యానాకు చెందిన వారే ఎక్కువగా చేరుతున్నారు. ఇందులో ఆ రాష్ట్రానికి చెందిన 8,01,580 మంది చేరారు. ఇక రెండో స్థానంలో ఉత్తరప్రదేశ్ ఉంది. ఈ స్కీంలో ఈ రాష్ట్రానికి చెందిన వారు మొత్తం 6,02,533 మంది ఉన్నారు. అలాగే 5,84,556 మందితో మహారాష్ట్ర 3వ స్థానంలో ఉంది. ఇక గుజరాత్ 3,67,848 మందితో 4వ స్థానంలో, చత్తీస్‌గడ్ 2,07,063 మదంఇతో 5వ స్థానంలో ఉంది.
ఇండ్లలో పనిచేసే వారు, డ్రైవర్లు, ప్లంబర్లు, దర్జీ పనిచేసేవారు, చెప్పులు కుట్టేవారు, రిక్షా కార్మికులు, చాకలివారు, రైతులు, చిరు వ్యాపారులు, ఇతర కార్మికులు ఈ పథకంలో చేరవచ్చు. ఇక వయస్సు ప్రకారం కనీసం రూ.55 నుంచి రూ.200 వరకు ప్రీమియం చెల్లించాలి. మిగిలిన మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది.
ఈ పథకంలో చేరేవారు ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ నంబర్, దాని ఐఎఫ్ఎస్‌సీ నంబర్, మొబైల్ నంబర్ లను ఇవ్వాల్సి ఉంటుంది. 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారు ఈ పథకంలో చేరవచ్చు. ఖాతాదారులు తమకు సమీపంలో ఉండే కామన్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లి ఈ పథకంలో తమ పేరును నమోదు చేయించుకోవచ్చు.