బిజెపి వివాదాస్పద మహిళా ఎంపి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ నాథురామ్ గాడ్సేను ‘దేశభక్తుడు అని చేసిన వ్యాఖ్యల పై లోక్ సభలో దుమారం రేగింది… ఒక్కసారిగా ఆమె వ్యాఖ్యలపై విపక్షాలు భగ్గుమన్నాయి. ప్రజ్ఞా ఠాగూర్ పై చర్యలు తీసుకోవాలని లోక్ సభలో కాంగ్రెస్ సహా విపక్షాలు స్పీకర్ డిమాండ్ చేస్తూ ఆమె వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసాయి. గాంధీని హత్య చేసిన వారిని దేవుడితో పోల్చడం దుర్మార్గమని విపక్షాలు మండిపడ్డాయి. గతంలో అజంఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు అని సభలో క్షమాపణలు చెప్పించారని,
ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించిన ఎంఐఎం సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ స్పీకర్ ని ఉద్దేశించి ప్రశ్నించారు. విపక్షాల ఆందోళనపై ప్రభుత్వం తరపున స్పందించిన కేంద్ర రక్షణ మంత్రి రాజనాధ్ సింగ్ ఆమె వ్యాఖ్యలపై అసహనం వ్యక్తం చేసారు. ప్రజ్ఞా ఠాగూర్ వ్యాఖ్యలు దురదృష్టకరం అన్న రాజనాధ్… మహాత్మ గాంధీ అందరికి ఒక మార్గదర్శి.. అప్పుడు ఇప్పుడు ఆయన అందరికి ఆదర్శమని కొనియాడుతూ… అటువంటి వక్తితో పోల్చడం అనేది ఎటువంటి వారికైనా మంచిది కాదని రాజనాథ్ అభిప్రాయపడ్డారు.
ప్రజ్ఞా ఠాగూర్ వ్యాఖ్యలు రికార్డ్ నుంచి తొలగించామని పేర్కొన్న స్పీకర్ ఓంబిర్లా… ఆ విషయంపై ఇప్పుడు చర్చ అనవసరమనడంతో విపక్షాలు మండిపడ్డాయి. స్పీకర్ నిర్ణయంతో సంతృప్తి చెందని విపక్షాలు లోక్ సభ నుంచి వాకౌట్ చేసాయి. ఇక ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. స్పందించిన ప్రజ్ఞా… తన వ్యాఖ్యలను సమర్ధించుకున్నారు. తన వాదనలో తప్పేమీ లేదని వాటిని వక్రీకరించారని ఆరోపించారు. ఇక ఇదిలా ఉంటే ఆమెపై పార్టీ చర్యలు తీసుకునే అవకాశం ఉందని బిజెపి వర్కింగ్ ప్రెసిడెంట్ జెపి నడ్డా వ్యాఖ్యానించారు. ఇక ఆమెను రక్షణ శాఖ సలహాదారుల కమిటి నుంచి ప్రభుత్వ౦ తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది.