తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీఆర్ఎస్ నుంచి నటుడు ప్రకాష్ రాజ్ ను రాజ్యసభకు పంపిస్తారని జోరుగా ప్రచారం నడుస్తోంది. అయితే దీనిపై ప్రకాష్ రాజ్ కూడా స్పందించారు. తెలంగాణ నుంచి రాజ్యసభకు పంపిస్తారనేది తెలియదని ఆయన అన్నారు. మంచి పనిని చెడగొట్టేందుకు ప్రచారం జరుగుతుందని ఆయన మండి పడ్డారు. రాజ్యసభ సీటు గురించి మాట్లాడటానికి ఇంది మంచి సమయం కాదని అన్నారు.
ఇటీవల ముంబై వెళ్లిన కేసీఆర్.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేని కలిశారు. ఈ మీటింగ్ లో నటుడు ప్రకాష్ రాజ్ కూడా పాల్గొన్నారు. స్వయంగా సీఎం కేసీఆర్ కు ముంబై ఎయిర్ పోర్ట్ లో స్వాగతం పలికారు ప్రకాష్ రాజ్. ఈ విషయం చర్చనీయాంశం అయింది. బీజేపీ వ్యతిరేఖత, వర్తమాన రాజకీయాలపై అవగాహన ఉండటంతో పాటు ఇంగ్లీష్, హిందీ, దక్షిణాది భాషలపై పట్టుఉండటం ప్రకాష్ రాజ్ కు కలిసి వచ్చే అంశంగా టీఆర్ఎస్ భావిస్తుందని.. అందుకే రాజ్యసభ సీటు కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జూన్ లో తెలంగాణ నుంచి మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవబోతున్నాయి. దీంతో ప్రకాష్ రాజ్ ను నామినేట్ చేసే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి.