సీఎం జగన్ కు ప్రకాశం టీడీపీ ఎమ్మెల్యే లు మరో బహిరంగ లేఖ రాశారు. గొట్టిపాటి రవికుమార్, డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఏలూరి సాంబశివరావు సిఎం జగన్ కు లేఖ రాసిన వారిలో ఉన్నారు. ప్రకాశం జిల్లా వరప్రదాయని వెలిగొండ ప్రాజెక్టును కేంద్రం ప్రకటించిన గెజిట్‌లో అనుమతి పొందిన ప్రాజెక్టుగా చేర్చకపోవడం వలన పశ్చిమ ప్రాంత రైతుల భవిష్యత్తు ప్రశ్నార్థకమైందని.. తక్షణమే కళ్ళు తెరిచి కేంద్ర గెజిట్‌లో అనుమతి పొందిన ప్రాజెక్టుగా చేర్చుటకై చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు టిడిపి ఎమ్మెల్యే లు.
గతంలో 2021కు నీళ్లు ఇస్తామన్న మీ మాటలు నీటి మూటలయ్యాయి… ఇకనైనా నిర్లక్ష్యం వీడి వెలిగొండ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. సాగర్‌లో నీళ్లు పుష్కలంగా ఉన్నా, సముద్రంలోకి నీరు వృధాగా పోతున్నా నీటి సరఫరా షెడ్యూల్‌ను ప్రకటించకుండా ఆరుతడి పంటలు వేసుకోండని ఉచిత సలహాలు ఇవ్వడం రైతాంగం పట్ల ఈ ప్రభుత్వానికున్న చిత్తశుద్ధిని తెలియజేస్తుందని చురకలు అంటించారు.
పర్చూరు ప్రాంత రైతుల దశాబ్దాల కల అయిన గుంటూరు ఛానల్ పొడిగింపు ప్రాజెక్టుకు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మంజూరు అయిన రూ. 274 కోట్ల పథకాన్ని రద్దు చేయటం సబబేనా..?? పాలేరుపై నిర్మిస్తున్న సంగమేశ్వరం ప్రాజెక్టు పనులను పునః ప్రారంభించి, పూర్తిచేయాలని కోరారు. రాళ్లపాడు ప్రాజెక్ట్‌ను ఆధునీకరించి ఆయకట్టు పెంచాలని డిమాండ్ చేశారు. మోటార్లకు మీటర్లు అమర్చడం ఉచిత విద్యుత్తును నిలిపివేసేందుకే … మోటార్లకు మీటర్లు ఏర్పాటు చేయడం రైతుల మెడకు ఉరితాళ్లు బిగించడమే… మీ స్వప్రయోజనాల కోసం రైతులను బలిపశువులుగా చేయొద్దని పేర్కొన్నారు.