సోనియా,మన్మోహన్ పై ప్రణబ్ ఆత్మకథలో సంచలన విషయాలు

-

పార్టీ వ్యవహారాలను చక్కదిద్దడం సోనియాకు సాధ్యం కాలేదా ప్రణబ్‌ ముఖర్జీ రాష్ట్రపతి అయ్యాక కాంగ్రెస్‌లో వచ్చిన మార్పులేంటి..2014 ఎన్నికల్లో సోనియా,మన్మోహన్ స్వయంకృతపరాధంతోనే కాంగ్రెస్ కి ఈ పరిస్థితి ఉత్పన్నమైందా..ఇద్దరు ప్రధానులు మన్మోహన్‌, మోడీ మధ్య పాలనలో ఉన్న వ్యత్యాసమేంటి… జనవరిలో రాబోతున్న ప్రణబ్ పుస్తకం ది ప్రెసిడెన్షియల్ ఇయర్స్‌లో ఈ వివరాలన్నీ ఉన్నట్లు తెలుస్తుంది.

బెంగాల్‌లోని ఒక మారుమూల గ్రామంలో కిరోసిన్ దీపం వెలుగులో చదువుకున్న ఒక సామాన్య పిల్లవాడు.. రాష్ట్రపతి భవన్‌లో దేశ తొలి పౌరునిగా కాలిడతాడని ఎవరైనా ఊహించగలరా? అనితర సాధ్యమైన తన జీవిత ప్రస్థానం గురించి మాజీ రాష్ట్రపతి దివంగత ప్రణబ్ ముఖర్జీ పంచుకున్న అనుభవాలు పుస్తకరూపంలో రానుంది. “ది ప్రెసిడెన్షియల్ ఇయర్స్” పుస్తకాన్ని 2021 జనవరిలో రూపా బుక్స్ పబ్లిషర్స్ ప్రజల ముందుకు తీసుకురానున్నారు.

రాష్ట్రపతిగా ఎదుర్కొన్న సవాళ్లను ఈ నాల్గో సంపుటంలో ప్రణబ్ ముఖర్జీ వివరించారని పబ్లిషర్స్‌ చెబుతున్నారు. రాష్ట్రపతిగా తన పదవీ కాలంలో రాజకీయ ప్రత్యర్థులైన ఇద్దరు ప్రధానమంత్రులతో తన అనుబంధాన్ని కూడా ప్రణబ్ ముఖర్జీ తన ఆత్మకథలో పంచుకున్నారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న కాలంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికే ఆయన సమయం సరిపోయిందని ప్రణబ్ పుస్తకంలో తెలిపారు. దీనివల్ల పాలనపై తీవ్ర దుష్ప్రభావాన్ని చూపిందని ప్రణబ్ దా అభిప్రాయపడ్డారు. అయితే నరేంద్ర మోడీ మొదటి టర్మ్‌లో నియంతృత్వ పోకడలను అనుసరించారని, ఇది ప్రభుత్వానికి, పార్లమెంటరీ వ్యవస్థకు, న్యాయ వ్యవస్థకు మధ్య సంబంధాలను దెబ్బతీసిందని ప్రణబ్ దాదా తన పుస్తకంలో రాశారు.

ఐదు దశాబ్దాలకు పైగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన ప్రణబ్ ముఖర్జీ ఆ పార్టీ విధానాలను కూడా తప్పుబట్టారు. 2004లో ప్రధానిగా ప్రణబ్ ముఖర్జీ బాధ్యతలు చేపట్టి ఉంటే 2014 లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసి ఉండేది కాదన్న కొందరు కాంగ్రెస్ నాయకుల అభిప్రాయాన్ని ఆయన విభేదించారు. తాను రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ నాయకత్వంలో రాజకీయ పోరాటపటిమ కొరవడిందని అంగీకరించారు. పార్టీ వ్యవహారాలను చక్కదిద్దడం సోనియా గాంధీకి సాధ్యపడలేదని అన్నారు. పార్లమెంట్‌కు మన్మోహన్ సింగ్ చాలాకాలం దూరంగా ఉండిపోవడంతో ఇతర ఎంపీలతో ఆయనకు వ్యక్తిగత సంబంధాలు లేకుండా పోయాయని పుస్తకంలో రాశారు.

అత్యంత అరుదైన, అపురూపమైన ఫోటోలు, చేతిరాత ప్రతులతో కూడిన ఈ ఆత్మకథ పుస్తకం ప్రణబ్ ముఖర్జీ జీవితంలోని ముఖ్య ఘట్టాలను ఆవిష్కరించనుంది.

Read more RELATED
Recommended to you

Latest news