పీఆర్సీ, ఉద్యోగుల సమ్మెపై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. క్యాంప్ ఆఫీసులో మంత్రుల కమిటీతో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన, పేర్ని నాని, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణా రెడ్డితో పాటు సీఎస్ సమీర్ శర్మ కూడా హాజరయ్యారు. నిన్న ఉద్యోగులతో జరిగిన చర్చల గురించి మంత్రులు సీఎంకు వివరిస్తున్నారు. మంత్రుల కమిటీ ముందు ఉద్యోగులు పెట్టిన అంశాలను గురించి సీఎంకు తెలియజేయనున్నారు. హెచ్ఆర్ఏ, పెన్షన్ స్లాబుల్లో మార్పులు, రికవరీ మినహాయింపులతో పడే ఆర్థిక భారం గురించి చర్చిస్తున్నట్లు సమాచారం. ఉద్యోగుల కోరుతున్న అంశాలతో రాష్ట్ర ఆర్థిక శాఖపై రూ. 7000 కోట్ల భారం పడుతుందని ఆర్థిక శాఖ అంచనా వేసింది.
ఇదిలా ఉంటే.. ఫిబ్రవరి 7 నుంచి సమ్మెకు ఉద్యోగులు వెళ్తుండటంతో సీఎం సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఉద్యోగులు సమ్మెకు వెళ్లకుండా తీసుకోవాల్సిన చర్యల గురించి సీఎం మంత్రులకు దిశానిర్థేశం చేసే అవకాశం ఉంది. ఉద్యోగులు పెట్టిన డిమాండ్లపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపైనే సమ్మె ఉండాలా..? వద్దా..? అనేది ఆధారపడి ఉంటుందని ఉద్యోగ సంఘాలు అంటున్నాయి.